న్యూఢిల్లీ: కేంద్రంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ GST నిర్మాణంలో మార్పులను ప్రతిపాదించింది. ఇకనుంచి రెండే శ్లాబులు ఉంచాలని నిర్ణయించింది. ఇది రోజువారీ వినియోగ వస్తువులపై పన్ను భారాన్ని తగ్గిస్తుంది. స్టాండర్డ్ (ప్రామాణిక), మెరిట్ (యోగ్యత) కింద వీటిని వర్గీకరిస్తూ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన ప్యానెల్‌కు నివేదించింది. వీటిపై అధ్యయనం అనంతరం జీఎస్టి కౌన్సిల్ ముందు ప్యానెల్ తన సిఫారసులు ఉంచనుంది. దాదాపు అన్ని రకాల వస్తు, సేవలు రెండు రేట్ల పరిధిలోనే ఉంటాయి.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన, రాష్ట్ర మంత్రులతో కూడిన GST కౌన్సిల్ సెప్టెంబర్‌లో సమావేశం అయ్యి రేటు హేతుబద్ధీకరణపై GoM ప్రతిపాదనను చర్చించనుంది.
దీపావళి నాటికి జీఎస్టీ రేట్లు తగ్గుతాయి: ప్రధానమంత్రి
79వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పన్ను భారాన్ని గణనీయంగా తగ్గించి, చిన్న పరిశ్రమలకు ప్రయోజనం చేకూర్చే ‘తదుపరి తరం’ జీఎస్టీ సంస్కరణలు అమలులో ఉన్నాయని, తక్కువ పన్నులు పౌరులకు దీపావళి కానుక అని ప్రధాని ప్రకటించారు. రోజువారీ వినియోగ వస్తువుల రేట్లు చౌకగా మారనున్నట్టు చెప్పారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. ప్రధాని ప్రసంగం తర్వాత ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది.
7 వస్తువులపై జీఎస్టీ పునరుద్ధరణ
ప్రస్తుతం నిత్యావసర ఆహార పదార్థాలపై సున్నా లేదా సున్నా శాతం జీఎస్టీ పన్ను వసూలు చేస్తుండగా, రోజువారీ వినియోగ వస్తువులపై 5 శాతం, ప్రామాణిక వస్తువులపై 12 శాతం, ఎలక్ట్రానిక్స్, సేవలపై 18 శాతం, లగ్జరీ వస్తువులపై 28 శాతం వసూలు చేస్తున్నారు. పునరుద్ధరించిన జీఎస్టీ విధానంలో లగ్జరీ వస్తువులకు 40 శాతం ప్రత్యేక రేటు ఉంటుందని అధికారులు తెలిపారు.
పునరుద్ధరించిన నిర్మాణాన్ని జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించాక, ప్రస్తుత 12 శాతం స్లాబ్‌లోని 99 శాతం వస్తువులు 5 శాతం లోకి మారుతాయి. అదేవిధంగా, ప్రస్తుతం 28 శాతం వద్ద వసూలు చేస్తున్న దాదాపు 90 శాతం వస్తువులు,సేవలు 18 శాతం పన్ను రేటుకు మారుతాయి.
40 శాతం ప్రత్యేక రేటు ఏడు వస్తువులపై మాత్రమే విధిస్తారని, పొగాకు కూడా ఈ రేటు కిందకు వస్తుందని, అయితే మొత్తం పన్ను రేటు ప్రస్తుత 88 శాతం వద్ద కొనసాగుతుందని వర్గాలు తెలిపాయి.
జూలై 1, 2017 నుండి కేంద్ర, రాష్ట్ర పన్నులను కలిపిన తర్వాత అమల్లోకి వచ్చిన ప్రస్తుత GST నిర్మాణంలో, అత్యధికంగా 65 శాతం పన్ను వసూళ్లు 18 శాతం లెవీ నుండి జరుగుతాయి. లగ్జరీ వస్తువులపై 28 శాతం ఉన్న టాప్ టాక్స్ ఆదాయంలో 11 శాతం వాటాను కలిగి ఉండగా, 12 శాతం స్లాబ్ ఆదాయంలో కేవలం 5 శాతం వాటాను కలిగి ఉంది.
నిత్యావసర వస్తువులపై అత్యల్పంగా ఉన్న 5 శాతం లెవీ మొత్తం GSTలో 7 శాతం వాటాను కలిగి ఉంది. వజ్రాలు విలువైన రాళ్ళు వంటి ఎగుమతి ఆధారిత రంగాలపై ప్రస్తుత రేట్ల ప్రకారం పన్ను విధించనున్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాష్ట్రాల మంత్రులతో కూడిన జిఎస్టి కౌన్సిల్ వచ్చే నెలలోనే సమావేశం కానుంది. ఈ సమావేశంలోనే జీవిత, ఆరోగ్య బీమాలపై పన్ను తగ్గింపు సహా జీఎస్టిలో రేట్ల క్రమబద్ధీకరణపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పన్నుల తగ్గింపు వల్ల సమాజంలోని అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని అంచనా వేస్తోంది.