-బీహార్‌లో ఎన్నికల కమిషన్ ఓట్ల దొంగతనానికి పాల్పడింది
-బీహార్‌లో SIR సవరణ కొత్త రకమైన ఓట్ల దొంగతనం
-తన వాదనలకు మద్దతుగా అఫిడవిట్‌ను సమర్పించాలని ఎన్నికల సంఘం డిమాండ్ చేసిన తర్వాత రాహుల్‌గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
బీహార్‌లో ఎస్‌ఐఆర్, ఎన్నికల కమిషన్‌పై రాహుల్ గాంధీ తన మాటల దాడిని తీవ్రతరం చేశారు. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రధాన ఎన్నికల కమిషనర్,ఇద్దరు ఎన్నికల కమిషనర్లపై ఓటు దొంగతనం ఆరోపణలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బీహార్‌లోని గయలో జరిగిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో భాగంగా నిర్వహించిన సభలో రాహుల్ ప్రసంగించారు. ఆ సభలో మాట్లాడుతూ…ఎన్నికల కమిషన్ “ఓటు చోరీ” వెలుగుచూసిన తర్వాత కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని ఈసీ తనను అడుగుతోందని అన్నారు. “ఓటు చోరీ” అనేది ‘భారత మాత’ ఆత్మపై దాడి అని ఆయన నొక్కి చెప్పారు.
“దేశం మొత్తం మిమ్మల్ని అఫిడవిట్ ఇవ్వమని అడుగుతుందని నేను ఎన్నికల సంఘానికి చెప్పాలనుకుంటున్నాను. మాకు కొంత సమయం ఇవ్వండి, ప్రతి అసెంబ్లీ, లోక్‌సభ స్థానంలో మీ దొంగతనాన్ని మేము పట్టుకుని ప్రజల ముందు ఉంచుతాము” అని ఆయన అన్నారు.
“ప్రధాని (నరేంద్ర) మోడీ జీ ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడినట్లుగానే, ఎన్నికల కమిషన్ బీహార్ కోసం SIR అనే ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది, అంటే కొత్త రకమైన ఓటు దొంగతనం అని అర్థం” అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో “ఓటు చోరీ” జరగదని బీహార్ ప్రజలు ఎన్నికల కమిషనర్లు, బిజెపి నాయకులకు ఒకే గొంతులో చెబుతారని రాహుల్ గాంధీ అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసి, తాజాగా బిహార్ లో చేపట్టిన ఎస్ఐఆర్‌లో పేరులేని కొందరితో మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశారు. వీరు ఆదివారం సాసారంలో మొదలైన ఓటర్ అధికార్ యాత్రలో పాలుపంచుకున్నారని రాహుల్ వివరించారు. ప్రస్తుతం వీరు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచే వీరి గుర్తింపు రద్దయిందని వ్యాఖ్యానించారు.
కాగా, రాహుల్ వెంట ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ నేత ముకేశ్ సహానీ, సీపీఐ ఎంఎల్ నేత దీపాంకర్ భట్టాచార్య ఉన్నారు.