ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయి గత మూడురోజులుగా ఎడతెరిపిలేని వర్షాలతో సతమతమవుతోంది. కరెంట్ కోతలతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో కరెంట్ అందక నిన్న సాయంత్రం ప్రజలతో కిక్కిరిసి ఉన్న రెండు మోనోరైల్ రైళ్లు ఎలివేటెడ్ ట్రాక్‌పై చిక్కుకుపోయాయి. ఎంతకూ కరెంట్ రాకపోవడంతో రైళ్లలో ఏసీ ఆగిపోయింది. దీంతో మోనోరైల్ లోపల డజనుకు పైగా ప్రయాణికులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు.
తక్షణమే అక్కడికి చేరుకున్న సహాయక సిబ్బంది మోనోరైల్ కిటికీలను పగలగొట్టి ప్రయాణీకులను రక్షించడానికి తలుపులు తెరిచి, మొదట మహిళలు, సీనియర్ సిటిజన్లను తరలించారు. మొత్తంగా రెండు మోనోరైల్ రైళ్లలో చిక్కుకున్న 782 మందిని రక్షించారు. కొంతమంది ప్రయాణికులు మూర్ఛపోయారు. అయితే ఒక ప్రయాణీకుడిని ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చిందని, అతని పరిస్థితి స్థిరంగా ఉందని చెబుతున్నారు. కాగా, సాయంత్రం 6.15 గంటల ప్రాంతంలో మైసూర్ కాలనీ, భక్తి పార్క్ స్టేషన్ల మధ్య ఇది చిక్కుకుపోయింది. ఈ సంఘటనపై విచారణ చేపడతామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.
“వర్షాల కారణంగా వివిధ స్టేషన్లలో ప్రజలు చిక్కుకుపోయారు. మోనోరైల్ రైళ్ల సామర్థ్యానికి మించి ఎక్కువ మంది ఎక్కారు” అని MMRDA జాయింట్ కమిషనర్ అస్తిక్ కుమార్ పాండే అన్నారు. “ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందుకూడా జరిగాయి. కానీ అప్పుడు అంతరాయం కొన్ని నిమిషాలు మాత్రమే కొనసాగింది. ఈసారి అది ఒకటిన్నర గంటలకు పైగా ఉందని అన్నారు.
“భారీ వర్షాల కారణంగా సబర్బన్ రైల్వే ఆగిపోయింది. దీని ఫలితంగా మోనోరైల్ స్టేషన్లలో అసాధారణ రద్దీ ఏర్పడింది. భద్రతా సిబ్బంది పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ, రద్దీని నియంత్రించలేకపోయారు” అని MMRDA ప్రకటన పేర్కొంది. ఇలాంటి సంఘటనలు “పునరావృతం కాకుండా నిరోధించడానికి సాంకేతిక సమీక్ష నిర్వహిస్తున్నారు” అని ప్రకటనలో పేర్కొన్నారు.