న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి పది మంది ముఖ్యమంత్రులలో నలుగురు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించుకున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR), నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక తెలిపింది.
రాష్ట్ర అసెంబ్లీలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 30 మంది సిట్టింగ్ ముఖ్యమంత్రుల స్వీయ ప్రమాణ స్వీకార అఫిడవిట్లను అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసింది. 12 మంది ముఖ్యమంత్రులు (40%) క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని, 10 మంది (33%) హత్యాయత్నం, కిడ్నాప్, లంచం, క్రిమినల్ బెదిరింపు వంటి తీవ్రమైన నేరాలలో నిందితులుగా ఉన్నారని తేలింది.
వాటిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 89 కేసులతో అగ్రస్థానంలో ఉన్నారు, తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ 47 కేసులతో తర్వాతి స్థానంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై 19 కేసులు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై 13 కేసులు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పై 5 కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖులపై నాలుగు కేసులు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రెండు, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పై ఒక కేసు నమోదయ్యాయి.
ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు 30 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధించదగిన ఆరోపణలపై కస్టడీలో ఉంటే వారిని ఆ పదవులనుంచి తొలగించాలని కోరుతూ కేంద్రం ఇటీవల పార్లమెంటులో మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. ఇదే సమయంలో ఈ విషయాలు వెల్లడి కావడం గమనార్హం.
కానీ ప్రతిపక్షం దీనిని బిజెపియేతర పాలిత రాష్ట్రాలను అస్థిరపరిచే “క్రూరమైన” ప్రయత్నంగా విమర్శించింది. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి Xలో మాట్లాడుతూ… “విపక్షాలను అస్థిరపరచడానికి ఉత్తమ మార్గం ప్రతిపక్ష సిఎంలను అరెస్టు చేయడానికి వారిపైకి కేంద్ర సంస్థలను ఉసిగొల్పడమే ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. విపక్షాలను ఎన్నికలలో ఓడించలేకపోయినా, ఏకపక్ష అరెస్టుల ద్వారా వారిని తొలగించడం” అని అన్నారు.
విశ్లేషించిన అఫిడవిట్లు ఆయా నేతలు గత ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు దాఖలు చేసిన అఫిడవిట్ల ద్వారా వెల్లడయిందని ADR నివేదిక పేర్కొంది.