హైదరాబాద్: గత పక్షం రోజులుగా హైదరాబాద్‌లో తరచూ ఇంటర్నెట్ అంతరాయం ఏర్పడుతుంది. దీనికి కారణం విద్యుత్ అధికారులు కేబుల్స్‌ను కట్‌చేయడమేనని అంటున్నారు. విద్యుత్ బోర్డు తెలంగాణ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తోందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI)తెలిపింది. నగరంలో కరెంట్ షాక్ మరణాలు సంభవించిన తర్వాత TGSPDCL అధికారులు నగరం అంతటా వైర్లను కత్తిరించడం ప్రారంభించారు.
“హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాలలో TGSPDCL సిబ్బంది చట్టవిరుద్ధంగా కేబుల్స్ కట్ చేయడాన్ని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) తీవ్రంగా ఖండిస్తోంది. దీనికి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఆగస్టు 22 నాటి తీర్పును ధిక్కరిస్తూ ఈ చర్యలు కొనసాగుతున్నాయని ఆ సంస్థ ఆరోపించింది. అటువంటి విధ్వంసక చర్యలను కోర్టు స్పష్టంగా నిరోధించింది.
టెలికాం కేబుల్‌లను తెంపడం వల్ల ఇంటర్నెట్ సేవలు విస్తృతంగా అంతరాయం కలుగుతోంది. గత కొన్ని రోజులుగా పరిస్థితి మరింత దిగజారింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో కీలకమైన కనెక్టివిటీని ప్రభావితం చేస్తోంది, ”అని హైదరాబాద్‌లోని ఇంటర్నెట్ అంతరాయంపై COAI తెలిపింది.
ఈ విషయంపై ఆగస్టు 25న హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌లను కత్తిరించవద్దని/తొలగించవద్దని లేదా ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని TGSPDCLను కోరినప్పటికీ, ఆ ఉత్తర్వు “స్పష్టంగా ఉల్లంఘిస్తున్నారని” ఆ సంస్థ పేర్కొంది.
బంజారా హిల్స్, కూకట్‌పల్లి, మాదాపూర్, కొండాపూర్, హబ్సిగూడ, చంపాపేట్, మణికొండ, సికింద్రాబాద్, కొంపల్లి వరకు ఇంటర్నెట్ ఫైబర్‌ను కత్తిరించినట్టు COAI తెలిపింది. “ఇంటర్నెట్‌ను అందించడం కేవలం ఒక సేవ మాత్రమే కాదు – ఇది నేటి డిజిటల్ యుగంలో ఒక ప్రాథమిక హక్కు అని COAI సంబంధిత వారందరికీ గుర్తు చేయాలనుకుంటోంది” అని ఓ ప్రకటనలో తెలిపింది.
“ఈ ఉల్లంఘనలకు బాధ్యులైన వారిని చట్టం ప్రకారం జవాబుదారీగా ఉంచాలని”, సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం తప్పనిసరి అని పేర్కొంటూ కేబుల్ ఆపరేటర్ల సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
ఆగస్టు 19న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మతపరమైన ఊరేగింపుల సందర్భంగా కరెంట్ షాక్ కారణంగా కనీసం 8 మంది మరణించిన నేపథ్యంలో, యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను తొలగించాలని ఆదేశించారు.
గత ఏడాది కాలంగా కేబుల్ ఆపరేటర్లకు ఇప్పటికే అనేక నోటీసులు జారీ చేశామని, తగినంత సమయం ఇచ్చామని, కానీ వారి నుండి స్పందన లేకపోవడం వల్ల ప్రజా భద్రతకు ముప్పు వాటిల్లిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అయితే, రెండు వర్గాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఇప్పుడు హైదరాబాద్‌లో ఇంటర్నెట్ అంతరాయాలకు దారితీసిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
దీనిపై డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇకపై ఎలాంటి వెసులుబాటు ఉండదని, విద్యుత్ స్తంభాల నుండి కేబుల్ వైర్లను వెంటనే తొలగించడంపై దృష్టి పెట్టాలని అధికారులందరినీ, సిబ్బందినీ ఆదేశించారు. అనధికార విద్యుత్ కనెక్షన్లను ఏర్పాటు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశించారు. విద్యుత్ శాఖ సిబ్బంది సహాయంతో మాత్రమే విద్యుత్ కనెక్షన్లను ఏర్పాటు చేయాలని, శిక్షణ లేని వ్యక్తులు ఇచ్చే కనెక్షన్లు ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నాయని ఉపముఖ్యమంత్రి చెప్పారు.