డెయిర్ అల్ బలాహ్: గాజా ఆసుపత్రి సముదాయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో కనీసం 20 మంది మరణించారు, వీరిలో నలుగురు జర్నలిస్టులు, అంబులెన్స్, సివిల్ డిఫెన్స్ సిబ్బంది కూడా ఉన్నారు. పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది. బూడిద, పొగ, శిధిలాలు గాలిలోకి ఎగిసాయి. ప్రజలు కేకలు వేస్తూ, సంఘటన స్థలం నుండి పారిపోతున్న దృశ్యాలు మనకు వీడియోల్లో కనిపిస్తున్నాయి.
ఇజ్రాయెల్ దాడిలో మరణించిన జర్నలిస్టుల్లో… అబు దకా (అసోసియేటెడ్ ప్రెస్), మొహమ్మద్ సలామా (అల్ జజీరా), హోసం అల్-మస్రీ (రాయిటర్స్), మోజ్ అబు తహా, అహ్మద్ అబు అజీజ్ ఉన్నారు. రాయిటర్స్ ఫోటోగ్రాఫర్ హతేమ్ ఖలీద్ కూడా గాయపడ్డారు.
ఇజ్రాయెల్ సైనికులు ఈ దాడిలో “డబుల్-ట్యాప్” వ్యూహాన్ని అనుసరించారు. ఇక్కడ మొదటి క్షిపణి దాడి చేసిన వెంటనే రెస్క్యూ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని రెండవ దాడి జరిగిందని CNN తెలిపింది.
🚨BREAKING :A video documents a horrific Israeli crime: targeting ambulance and civil defense crews as they were rescuing victims and the wounded after Israel bombed Nasser Medical Complex in Khan Younis among them was journalist Hossam al-Masri. pic.twitter.com/hKlZGBIpoa
— Gaza Notifications (@gazanotice) August 25, 2025
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు దీనిని “విషాదకరమైన దుర్ఘటన” అని అభివర్ణిస్తూ, “గాజాలోని నాజర్ ఆసుపత్రిలో ఈరోజు జరిగిన విషాద దుర్ఘటన పట్ల ఇజ్రాయెల్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. జర్నలిస్టులు, వైద్య సిబ్బంది మరియు అన్ని పౌరుల కృషిని ఇజ్రాయెల్ విలువైనదిగా భావిస్తోంది” అని అన్నారు.
ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ ఈ దాడిని ఖండించింది, దాదాపు రెండు సంవత్సరాల క్రితం గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అంతర్జాతీయ జర్నలిస్టులకు ఇది అత్యంత ప్రాణాంతకమైన దాడి అని బిబిసి తెలిపింది.
మార్చిలో, ఇజ్రాయెల్ దళాలు దక్షిణ రఫాలో ఐదు అంబులెన్స్‌లు, ఒక అగ్నిమాపక వాహనం, ఒక UN వాహనంతో సహా అనేక రెస్క్యూ వాహనాలపై కాల్పులు జరిపాయి, పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సొసైటీకి చెందిన ఎనిమిది మంది సభ్యులు, ఐదుగురు పౌర రక్షణ సిబ్బంది, ఒక UN ఉద్యోగితో సహా కనీసం 15 మంది సహాయ కార్మికులు మరణించారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌తో సహా మానవ హక్కుల సంస్థలు ఈ సంఘటనలపై స్వతంత్ర దర్యాప్తుకు పిలుపునిచ్చాయి, అంతర్జాతీయ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించాయని పేర్కొంటున్నాయి.
మానతా సహాయాన్ని ఇజ్రాయెల్ అడ్డుకోవడంతో గాజాలో పరిస్థితులను మరింత దిగజార్చింది, చాలా మంది ఆకలి, పోషకాహార లోపంతో మరణిస్తున్నారు. వైద్యులు, సహాయ సంస్థలు, మానవ హక్కుల సంఘాలు గాజా కరువు అంచున ఉందని హెచ్చరించాయి. గాజాలోని అతిపెద్ద నగరం, పరిసర ప్రాంతాలలో పూర్తిగా “మానవ నిర్మిత కరువు”ఏర్పడిందని UN మద్దతుగల ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ గత వారం నిర్ధారించింది.
కాల్పుల విరమణ విజ్ఞప్తును తిరస్కరిస్తూ, నెతన్యాహు నేతృత్వంలోని ఇజ్రాయెల్ ప్రభుత్వం 2023 అక్టోబర్ 7 నుండి గాజాలో వైమానిక దాడులను కొనసాగిస్తోంది, దాదాపు 63,000 మంది పాలస్తీనియన్లు మరణించారు, వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు కావడం గమనార్హం.