న్యూఢిల్లీ: ఇది అత్యంత ఆందోళనకర దృశ్యం. దేశ రాజధాని ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో నుండి ఈ దృశ్యాలు బయటకు వచ్చాయి. అసోంలో ముస్లింలను బంగ్లాదేశీలు అని ముద్ర వేయడాన్ని వ్యతిరేకిస్తూ దేశంలోని హిందుత్వ వ్యతిరేక మేధావులు ఏర్పాటు చేసిన సమావేశం జరుగుతుండగా, హిందుత్వవాదుల గుంపు కార్యక్రమం జరుగుతున్న హాల్‌లోకి చొరబడి సమావేశాన్ని అల్లకల్లోలం చేసింది. “జై శ్రీరామ్”, “భారత మాతాకీ జై” అంటూ నినాదాలు చేశారు. మేధావులను టెర్రరిస్టులంటూ శాపనార్థాలు పెట్టారు. అదృష్టవశాత్తూ అక్కడున్న మేధావులు, మహిళలు ఎవరూ శారీరకంగా గాయపడలేదు.

ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ప్రజలు ఇలాంటి ద్వేషపూరిత ఘటనల నుంచి ఎప్పటివరకు ప్రాణాలతో బయటపడగలరు? ఇది మోదీ, ఆరెస్సెస్, హిందుత్వ వ్యతిరేకంగా ఆలోచించే మేధావులను హింసలోకి నెట్టే ప్రయత్నం కాదా? ఇది స్పష్టమైన బెదిరింపు కాదా? ఇది మోదీ, హిందుత్వ ఫాసిస్ట్ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారందరికీ ఒక హెచ్చరిక కాదా?
సీదా హమీద్, హర్ష్ మందర్, ప్రొఫెసర్ అపూర్వానంద్ వంటి ప్రముఖులు ఉన్న ప్రాంగణంలోకి హిందూ సేన గుంపు ఈ విధంగా దూసుకొచ్చి భయానక వాతావరణాన్ని సృష్టిస్తే, మనం ఎక్కడ ఉన్నామో మీరు ఊహించుకోగలరు!
మరింత భయంకరమైన విషయం ఏమిటంటే…ఢిల్లీ పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. ఢిల్లీ పోలీస్ అమిత్ షా ఆధీనంలో ఉన్న సంగతి తెలిసిందే. దేశంలో హింస, ద్వేషం, అల్లర్లకు పాల్పడే హిందుత్వ గుంపుకు మద్దతు ఎక్కడి నుంచి వస్తోందో మీరు గ్రహించగలరు. ఇలాంటి విధ్వంసక చర్యలకు ఈ స్థాయి మద్దతు లభిస్తే దేశం ఏదారిలోకి వెళుతుందో మీరు ఆలోచించండి.
దేశంలోని ప్రతి వ్యక్తి, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో హిందూ సేన చేసిన ఈ గూండాగిరిని అత్యంత కఠినంగా, స్పష్టమైన పదాలతో ఖండించాలి. రేపు ఈ ముస్లిం వ్యతిరేక ద్వేషంలో మునిగిపోయిన పిచ్చి గుంపు మోదీ వ్యతిరేకుల ఇళ్లలోకి దూసుకెళ్లక ముందే, ఏకమై తక్షణమే ఐక్య మతపరమైన ఉద్యమాన్ని ప్రారంభించాలి.