న్యూఢిల్లీ: భారత ఎగుమతులపై అమెరికా విధించిన భారీ సుంకాలు తీవ్ర బాధాకరమని భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ రఘురామ్ రాజన్ అన్నారు. అయితే భారత్ కు ఇదో పెద్ద మేల్కొలుపు అని అభివర్ణించారు. తమ వాణిజ్యాన్ని మరింత విస్తరించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.
భారత వస్తువులపై అమెరికా విధించిన 50 శాతం సుంకాలు నిన్నటినుండి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రఘురామ్ రాజన్ మాట్లాడుతూ… నేటి ప్రపంచ క్రమంలో వాణిజ్యం, పెట్టుబడి, ఆర్థికం ఆయుధంగా మారాయని, భారతదేశం జాగ్రత్తగా నడచుకోవాలని డాక్టర్ రాజన్ హెచ్చరించారు.
“మన దేశానికి ఇది మేల్కొలుపు . మనం ఏ ఒక్క దేశంపైనా పెద్దగా ఆధారపడకూడదు. భారత్ ఇక మీదట యూరప్, చైనా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ లాంటి దేశాలతో కలసి ముందుకు నడవాలని చెప్పారు. దాంతో పాటూ దేశంలో యువతకు ఉపాధి కల్పించడానికి అవసరమైన 8–8.5% వృద్ధిని సాధించడంలో మనకు సహాయపడే సంస్కరణలను ప్రారంభించాలని ప్రభుత్వానికి రఘురామ రాజన్ సూచించారు.
రష్యా ముడి చమురును కొనుగోలు చేసినందుకు భారతదేశంపై ట్రంప్ ప్రభుత్వం కఠినమైన సుంకాలు విధించగా, రష్యా చమురును ఎక్కువగా దిగుమతి చేసుకునే చైనా… మాస్కో నుండి గణనీయమైన మొత్తంలో ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న యూరప్ దేశాలు అమెరికా నుండి సుంకాలను తప్పించుకున్నాయి.
రష్యా చమురు దిగుమతులపై భారతదేశం తన విధానాన్ని తిరిగి అంచనా వేయాలని రాజన్ సూచించారు. “ఎవరికి ప్రయోజనం, ఎవరికి నష్టం అని మనం అడగాలి. శుద్ధి కర్మాగారాలు అదనపు లాభాలను ఆర్జిస్తున్నాయి, కానీ ఎగుమతిదారులు సుంకాల ద్వారా ధర చెల్లిస్తున్నారు. ప్రయోజనం పెద్దగా లేకపోతే, బహుశా మనం ఈ కొనుగోళ్లను కొనసాగించాలా వద్దా అని ఆలోచించడం మంచిదని ఆయన అన్నారు.”
అయితే ఇక్కడ సమస్య న్యాయబద్ధత కాదని..భౌగోళిక రాజకీయమని చెప్పారు. మన సరఫరా వనరులను, ఎగుమతి మార్కెట్లను మనం వైవిధ్యపరచాలి రాజన్ చెప్పారు. అన్ని దేశాలతో కలిసి పని చేయాలి తప్ప ఎవరి మీదా ఆధారపడకండి అంటూ సలహా ఇచ్చారు. ఈ సంక్షోభాన్ని ఒక అవకాశంగా చూడాలని పేర్కొన్నారు.
“చైనా, జపాన్, అమెరికా లేదా మరెవరితోనైనా కలిసి పనిచేయండి. కానీ వాటిపై ఆధారపడకండి. సాధ్యమైన చోట స్వావలంబనతో సహా ప్రత్యామ్నాయాలు ఉన్నాయని నిర్ధారించుకోండి” అని రాజన్ అన్నారు.
వ్యాపారం చేయడంలో సౌలభ్యాన్ని, దేశీయ సంస్థల మధ్య బలమైన పోటీతత్వాన్ని మెరుగుపరచడానికి నిర్మాణాత్మక సంస్కరణల అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
అదనపు సుంకాలు.. అమెరికా-భారత్ సంబంధాలకు “దెబ్బ” అని అభివర్ణిస్తూ.. ఈ చర్య ముఖ్యంగా రొయ్యల రైతులు, వస్త్ర తయారీదారులు వంటి చిన్న ఎగుమతిదారులను దెబ్బతీస్తుందని, జీవనోపాధిని ప్రమాదంలో పడేస్తుందని రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. “ఇది అమెరికా వినియోగదారులకు కూడా హానికరం, వారు ఇప్పుడు 50 శాతం మార్కప్‌తో వస్తువులను కొనుగోలు చేస్తారు”.
అలాగే, ట్రంప్ ప్రభుత్వ టారిఫ్ వెనుక మూడు ప్రధాన కారణాలను ఆయన సూచించారు. 1. వాణిజ్య లోటు అనేది ఇతర దేశాల దోపిడీ అని నమ్మకం… 2. టారిఫ్‌లు విదేశీ ఉత్పత్తిదారులపై భారమై, అమెరికాకు చవకగా ఆదాయం వస్తుందని భావన.. 3. ఇటీవలి కాలంలో టారిఫ్ ను విదేశాంగ విధానంలో కక్షసాధింపు కోసం ఉపయోగిస్తున్నారని రఘురామ్ రాజన్ చెప్పుకొచ్చారు.
ఇక్కడ న్యాయంగా ఉండటం సమస్య కాదు” అని ఆయన అన్నారు. ముఖ్యంగా న్యూఢిల్లీ ఇతర ఆసియా దేశాలతో సమానంగా సుంకాలను ఆశించిందని, కానీ అలా జరగలేదని రాజన్ పేర్కొన్నారు.
మరోవంక అమెరికా అధ్యక్షుడి వైఖరిలో ఛేంజ్ కనిపించింది. రష్యా, భారత్, ఇతర దేశాలతో జరుగుతున్న చర్చల్లో ఏదో మార్పు వచ్చింది. భారత్ తాను చెప్పే నియమాల ప్రకారం నడుచుకోవడం లేదని ట్రంప్ అనుకున్నారు. దానిని ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం ఉందని నిర్ణయించుకున్నారు. అందుకే అదనపు సుంకాలను అమలు చేశారు. ఏది ఏమైనా భారత్ ఇప్పుడు మరింత తెలివిగా ఆలోచించి అడుగులు వేయాల్సి సమయం ఆసన్నమైందని రాజన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రష్యా చమురు ద్వారా భారతదేశం “లాభం” పొందుతోందని వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో చేసిన ఆరోపణల గురించి సమాధానమిస్తూ…భారతదేశం అమెరికా అధ్యక్షుడి నియమాల ప్రకారం నడుచుకోవడ లేదని, ఎలాగైనా దారికి తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు. నవారో అనుమతి లేకుండా ఫైనాన్షియల్ టైమ్స్‌లో రాయడు” అని రాజన్ అన్నారు.
ట్రంప్‌కు చాలా కాలంగా సహాయకుడిగా ఉన్న నవారో గత వారం మాట్లాడుతూ… భారత శుద్ధి కర్మాగారాలు (ఉక్రెయిన్) యుద్ధానికి (రష్యన్ చమురు కొనుగోలు చేయడం ద్వారా) ఆజ్యం పోస్తూ డబ్బు సంపాదించుకుంటున్నాయని అన్నారు. “వారికి చమురు అవసరం లేదు – ఇది లాభదాయక పథకం” అని ఆయన వాదించారు.
మొత్తంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్ ‘పరస్పర’ సుంకాలను ప్రకటించినప్పటి నుండి భారతదేశం, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి.