న్యూఢిల్లీ: భారతదేశ విభజనను గుర్తుచేస్తూ… ఆగస్ట్ 14న’విభజన గాయాల స్మారక దినం’ సందర్భంగా NCERT ప్రత్యేక మాడ్యూల్‌ను విడుదల చేసింది. విభజనకు మహ్మద్ అలీ జిన్నాతో పాటు కాంగ్రెస్‌పార్టీని బాధ్యులుగా పేర్కొంది. కాగా, ఈ వాదనను ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ (IHC) తీవ్రంగా ఖండించింది. ఇది మతపరమైన ఉద్దేశ్యంతో కూడిన అబద్ధాలు” అని పేర్కొంది.
ఈ పాఠ్యాంశాలను “వక్రీకరించారని ఆగస్టు 25 నాటి తీర్మానంలో IHC పేర్కొంది, దీనిని “పాఠశాలకు వెళ్లే లేత మనస్సులోకి జొప్పిస్తున్నారని విమర్శించింది. దేశ విభజనకు ముస్లిం లీగ్‌ను మాత్రమే కాకుండా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌ను బాధ్యుల్ని చేసింది. అదే సమయంలో బ్రిటిష్ వలస పాలకులను బాధ్యత నుండి తప్పించాయి. “చరిత్రను పూర్తిగా తలక్రిందులుగా చేస్తూ, స్వాతంత్ర్య పోరాటంలో మతపరమైన శక్తుల విధేయత వైఖరికి అనుగుణంగా, ఈ పాఠ్యాంశాలు దేశ విభజనకు కాంగ్రెస్‌ను బాధ్యత వహించేలా చేస్తున్నాయి, అదే సమయంలో బ్రిటిష్ వారికి క్లీన్ చిట్ ఇస్తున్నాయి” అని IHC పేర్కొంది.
ఈ నెల ప్రారంభంలో NCERT ‘విభజన గాయాల స్మారక దినోత్సవాన్ని పురస్కరించుకుని…9 నుండి 12 తరగతులకు ఒకటి, 6 నుండి 8 తరగతులకు మరొక మాడ్యూల్‌లను విడుదల చేసింది. విభజనకు ముగ్గురు కారణమని ఆ పాఠాలు పేర్కొన్నాయి. విభజనకు జిన్నా డిమాండ్ చేయగా, కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆమోదించిందని, బాటన్ అమలుచేశారని తెలిపింది.
కాగా, విభజన అనేది 19వ శతాబ్దం నుండి, ముఖ్యంగా 1857 తిరుగుబాటు తర్వాత హిందువులు, ముస్లింలు భుజం భుజం కలిపి పోరాడినా, బ్రిటిష్ వారు అనుసరించిన “విభజించి పాలించు” విధానానికి పరాకాష్ట అని వాదించింది. బ్రిటిష్ వారు క్రమంగా మతపరమైన విభజనలను తీవ్రతరం చేశారని, కాలక్రమేణా విభజన అనివార్యమైందని తీర్మానం పేర్కొంది.
IHC మాడ్యూల్‌లలో హింసను ఏకపక్షంగా చిత్రీకరించడాన్ని కూడా విమర్శించింది, అవి హిందువులు, సిక్కులపై జరిగిన దురాగతాలను వివరించినప్పటికీ, ముస్లింలపై చోటుచేసుకున్న ప్రతీకార భయానక సంఘటనల గురించి ప్రస్తావించలేదని పేర్కొంది. అటువంటి లోపాలు, చారిత్రక అవగాహన కంటే మతపరమైన విభజనకు తోడ్పడతాయని పేర్కొంది.