బీజింగ్: అమెరికా, భారత్ మధ్య కొనసాగుతున్న వాణిజ్య సుంకాల ఉద్రిక్తల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు మాట్లాడుతూ… భారత్, చైనాలు రెండూ అభివృద్ధి భాగస్వాములే కానీ, ప్రత్యర్థులు కాదని అభిప్రాయపడ్డారు. అంతేకాదు ప్రపంచ వాణిజ్యాన్ని స్థిరీకరించడానికి కృషి చేస్తామని మోదీ, జిన్‌పింగ్ స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య ఉన్న వైరుధ్యాలు, వివాదాలుగా మారకూడదని పేర్కొన్నారు. ఈ మేరకు షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు.
షీ జిన్‌పింగ్‌తో జరిగిన చర్చల సందర్భంగా, ప్రధాని మోదీ మాట్లాడుతూ …”2.8 బిలియన్ల ప్రజల” ప్రయోజనాలు భారతదేశం-చైనా సహకారంతో ముడిపడి ఉన్నాయని అన్నారు, ఇది “మొత్తం మానవాళి సంక్షేమానికి కూడా మార్గం సుగమం చేస్తుందని ఆయన అన్నారు. “గత సంవత్సరం జూన్‌లో మేం చాలా అర్థవంతమైన చర్చలను జరిపాం. మా సంబంధాలు సానుకూల దిశగా సాగాయి. సరిహద్దులో బలగాలు వెనక్కి వెళ్లిన తర్వాత శాంతి, స్థిరత్వ వాతావరణం ఏర్పడింది. సరిహద్దు నిర్వహణకు సంబంధించి మా ప్రత్యేక ప్రతినిధుల మధ్య ఒక ఒప్పందం కుదిరింది” అని అన్నారు.
మరోవైపు, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాట్లాడుతూ “ప్రపంచం మార్పు దిశగా కదులుతోంది. చైనా, భారత్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రెండు నాగరికతలు. ఈ రెండూ ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశాలు, గ్లోబల్ సౌత్‌లో భాగం. డ్రాగన్, ఏనుగు స్నేహితులుగా ఉండటం, మంచి పొరుగువారిగా ఉండటం చాలా ముఖ్యం” అని అన్నారు.
మొత్తంగా బీజింగ్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి న్యూఢిల్లీ ముందుకు రావడానికి ఆర్థిక సంబంధాలు కీలకమైన చోదక శక్తిగా ఉండటంతో, వాణిజ్యాన్ని విస్తరించడానికి, లోటును తగ్గించడానికి, “పారదర్శకతను పెంచడానికి నాయకులు అంగీకరించారని భారత బృందం పేర్కొంది, అదే సమయంలో ప్రపంచ వాణిజ్యాన్ని స్థిరీకరించడంలో రెండు ఆర్థిక వ్యవస్థల పాత్రను నొక్కి చెప్పింది.