న్యూఢిల్లీ: మణిపూర్ రాష్ట్రంలో మెయిటీ – కుకి వర్గాల మధ్య జాతి హింస చెలరేగిన రెండేళ్ల తర్వాత మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ మొదట మిజోరంకు కొత్త బైరాబి-సైరాంగ్ రైల్వేను ప్రారంభిస్తారు. తర్వాత ఆ రాష్ట్ర రాజధాని ఐజ్వాల్ నుండి మణిపూర్‌కు ప్రధాని వస్తారని తమకు సమాచారం అందిందని మిజోరం ప్రభుత్వానికి చెందిన పలువురు అధికారులు తెలిపారు.
అయితే, ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన తుది ప్రయాణ ప్రణాళిక తమకు ఇంకా అందలేదని వారు తెలిపారు. ఇంఫాల్ అధికారులు సైతం ఈ పర్యటనను నిర్ధారించలేకపోయారు.
మరోవంక మిజోరం ప్రధాన కార్యదర్శి ఖిల్లీ రామ్ మీనా సోమవారం వివిధ శాఖలు,చట్ట అమలు సంస్థలతో సమావేశమై ప్రధానమంత్రి పర్యటనకు సంసిద్ధతను సమీక్షించారు.
భద్రతా చర్యలు, ట్రాఫిక్ నిర్వహణ, స్వాగత కార్యక్రమం, వీధుల అలంకరణతో సహా వివిధ అంశాలపై సమావేశంలో చర్చించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
ఐజ్వాల్‌లోని లమ్మౌల్‌లో జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొనేందుకు అనుమతించే ఏర్పాట్లపై కూడా సమావేశంలో చర్చించినట్లు తెలిపింది.
51.38 కి.మీ పొడవైన రైల్వే లైన్ కేంద్రం తరుపన యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగం, ఇది ఈశాన్య ప్రాంతం అంతటా కనెక్టివిటీతో పాటు ఆర్థిక ఏకీకరణను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త రైల్వే లైన్ అస్సాంలోని సిల్చార్ పట్టణం ద్వారా ఐజ్వాల్‌ను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతుంది.
మణిపూర్ హింసలో 250 మందికి పైగా మృతి
మే 2023లో మెయిటీ కమ్యూనిటీకి షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించాలనే డిమాండ్‌కు నిరసనగా మణిపూర్‌లో హింస ప్రారంభమైంది. కుకి కమ్యూనిటీ నిరసన ప్రదర్శన తర్వాత మణిపూర్లో హింస చెలరేగింది. పరిస్థితిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో భద్రతా దళాలను మోహరించింది. హింస కారణంగా 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంతో పాటు సుమారుగా 60 వేల మందికి పైగా ప్రజలు సహాయ శిబిరాల్లో నివసిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. అనంతరం ఆగస్టులో దీనిని మరో ఆరు నెలలు పొడిగించారు. రాష్ట్రపతి పాలన తర్వాత రాష్ట్రంలో పరిస్థితి కొంతవరకు సాధారణ స్థితికి చేరుకుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా మణిపూర్‌ను సందర్శించారు.
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బిరేన్ సింగ్ పార్టీలో నాయకత్వంపై ఏకాభిప్రాయం లేకపోవడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 21 నెలల అనంతరం ఫిబ్రవరి 13, 2025న రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. ఈ చర్య ప్రజాస్వామ్య సూత్రాల ఉల్లంఘన అని, రాష్ట్రపతి పాలన నిర్ణయం ఆలస్యంగా తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. మణిపూర్‌లో హింస తగ్గిందని, శాంతి కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.