మాస్కో: ప్రాణాంతక మహమ్మారి క్యాన్సర్ బాధితులకు రష్యా గుడ్‌న్యూస్ వినిపించింది. సరైన చికిత్స లేక జీవితాంతం క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్‌ను కనిపెట్టింది. ‘ఎంటెరోమిక్స్’ పేరుతో తీసుకొచ్చిన ఈ టీకా క్లినికల్ ట్రయల్స్‌లో వంద శాతం ప్రభావం చూపింది. ఈ సంచలన వార్త లక్షలాది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఓ ఆశాకిరణంగా మారింది.
పలు కేసుల్లో క్యాన్సర్ గడ్డల పరిమాణాన్ని ఈ వ్యాక్సిన్ ఏకంగా 60 శాతం నుంచి 80 శాతం దాకా తగ్గిస్తున్నట్లు వెల్లడైంది. ఎలాంటి దుష్ప్రభావాలు లేవు. COVID-19 వ్యాక్సిన్‌ల మాదిరిగానే mRNA సాంకేతికతను ఉపయోగించి అభివృద్ధి చేసిన ఎంటరోమిక్స్ వ్యాక్సిన్… క్యాన్సర్ కణాలను గుర్తించడానికి, తొలగించడానికి, రోగనిరోధక వ్యవస్థకు శిక్షణ ఇచ్చే విధంగా రూపొందించారు. అంతేకాదు ఈ టీకా కీమోథెరపీ వంటి సాంప్రదాయ చికిత్సలకు సురక్షితమైన, మరింత తెలివైన ప్రత్యామ్నాయం.
ఎంటరోమిక్స్ వ్యాక్సిన్‌ను ప్రధానంగా పెద్ద పేగు క్యాన్సర్ రోగి కణితి ప్రొఫైల్‌కు అనుగుణంగా ఇమ్యునోథెరపీని అందిస్తుంది. ఈ ట్రయల్స్‌లో 48 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రయోగ పరీక్షలను ఎంగెల్‌హార్డ్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ సహకారంతో రష్యాకు చెందిన నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియోలాజికల్ సెంటర్ నిర్వహించింది. రష్యాలోని వ్లాడివోస్తాల్లో 10వ తూర్పు ఆర్థిక వేదిక సదస్సులో ‘ఎంటెరోమెక్స్’ టీకా గురించి ప్రకటించారు. 75 దేశాలకు చెందిన 8,400 మంది పరిశోధకులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ రష్యన్ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను ఆంకాలజీలో ఒక గేమ్-ఛేంజర్‌గా రూపొందనుంది, ఇది రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదానికి ఒక అడుగు దూరంలో ఉంది.
కాగా, రష్యా వెల్లడించిన ఈ సంచలన వార్తను గ్లోబల్ ఆంకాలజీ శ్రద్ధగా గమనిస్తోంది. ఈ ఫలితాలు కఠినమైన పరీక్షల ద్వారా ధృవీకరిస్తే… ఎంటరోమిక్స్ ఒక కొత్త యుగానికి నాంది పలికినట్లవుతుంది. అత్యంత కచ్చితత్వంతో క్యాన్సర్ కణాలను తుదముట్టించడమే లక్ష్యంగా ఈ ఎంటెరోమిక్స్ టీకాను అభివృద్ధి చేశారు. ఇది కండరాలలోకి ఇచ్చే ఇంజెక్షన్. రష్యాలోని చాలా ఆంకాలజీ సెంటర్లలో ఇప్పటికే దీనిని క్లినికల్‌గా ఉపయోగించారు. కీమోథెరపీ లేదా రేడియేషన్ విధానాల మాదిరిగా కాకుండా ఈ టీకాను ప్రతి రోగికి వ్యక్తిగత అవసరాన్ని గుర్తించి ఇవ్వవలసి ఉంటుంది.
రష్యా నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియోలాజికల్ సెంటర్,ఎంగెల్హార్డ్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీల సమన్వయంతో సంవత్సరాల పరిశోధన తరువాత ఎంటరోమిక్స్ టీకా ఆవిష్కృతమైంది. మొత్తంగా ఈ టీకా క్యాన్సర్ చికిత్సా రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.