దుబాయ్: మధ్యప్రాచ్యంలో సంపన్న గల్ఫ్ దేశం ఖతార్‌లో ఉన్న హమాస్ నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. సమ్మిట్ ఆఫ్ ఫైర్ పేరిట జరిపిన ఈ దాడితో దోహా నగరంలోని ఖతారా జిల్లా పరిధిలో పలు చోట్ల పేలుళ్లు సంభవించాయని, ఆకాశంలో దట్టమైన పొగలు అలుముకున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
తాము కచ్చితమైన దాడులు చేశామని, 2023 అక్టోబరు 7 నాటి మారణహోమానికి ప్రత్యక్షంగా కారణమైనవారిని లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) తెలిపింది. కాగా, ఈ దాడి నుండి తమ సీనియర్ నాయకత్వం సురక్షితంగా బయటపడిందని హమాస్ పేర్కొంది.
ఇజ్రాయెల్ దాడిని పిరికి చర్యగా ఖతార్ అభివర్ణించింది. అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను ఇది ఉల్లంఘించడమేనని ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మాజెద్ అల్-అన్సారీ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ దుస్సాహసాన్ని సహించేది లేదని స్పష్టంచేశారు.
కాగా, ఈ దాడులను ఫ్రాన్స్, సౌదీ అరేబియా ఖండించాయి. సౌదీ యువరాజు సల్మాన్ ఇజ్రాయెల్ చర్యను అంతర్జాతీయ నేరంగా పేర్కొంటూ.. ఖతార్‌కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఇజ్రాయెల్ దాడిని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఖండించారు. ఖతార్ సార్వభౌమత్వంపై చేసిన దుస్సాహసంగా అభివర్ణించారు.
పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపడమే లక్ష్యంగా ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలేలా ఇజ్రాయిల్ చర్యలు వున్నాయని యెమెన్ విదేశాంగశాఖ విమర్శించింది.
అల్జీరియా విదేశాంగశాఖ ఈ హత్యాయత్నాన్ని ఖండిస్తూ ఒక ప్రకటన చేసింది. ఇది అత్యంత దారుణమైనదని వ్యాఖ్యానించింది. ఆక్రమణదారుడు శాంతికి సుముఖంగా లేడని స్పష్టమైందని పేర్కొంది.
కాగా, ఇజ్రాయెల్ దాడి జరిపి ప్రమాదకరమైన జూదం ఆడిందని విశ్లేషకులు చెబుతున్నారు, ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ చర్చలపై సందేహాలు నెలకొన్నాయి. ఈ ప్రాంతం అంతటా రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. గల్ఫ్ అరబ్ మిత్రదేశాలకు US భద్రతా హామీలపై సందేహాలను లేవనెత్తింది.