ఐక్యరాజ్యసమితి: పాలస్తీనాకు భారత్ మద్దతు పలికింది. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య శాంతియుత పరిష్కారం, ‘రెండు దేశాల పరిష్కార మార్గం’ అమలుపై న్యూయార్క్ డిక్లరేషన్‌ను ఆమోదించే తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసింది.
ఫ్రాన్స్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని 142 దేశాలు అనుకూలంగా, 10 దేశాలు వ్యతిరేకంగా, 12 దేశాలు గైర్హాజరు కావడంతో ఆమోదించారు. వ్యతిరేకంగా ఓటు వేసిన వారిలో అర్జెంటీనా, హంగేరీ, ఇజ్రాయెల్, US ఉన్నాయి.
జూలైలో UN ప్రధాన కార్యాలయంలో జరిగిన ఫ్రాన్స్, సౌదీ అరేబియా సహ-అధ్యక్షత వహించిన ఉన్నత స్థాయి అంతర్జాతీయ సమావేశంలో ఈ ప్రకటనను అంగీకరించారు.
ఈ ప్రకటన ప్రకారం… పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడంతో పాటు, ఇజ్రాయెల్-పాలస్తీనా దేశాల మధ్య ఉన్న వివాద పరిష్కారానికి కృషిచేయాలని ఇజ్రాయెల్ నాయకత్వాన్ని కోరింది.
“పాలస్తీనియన్లపై హింసను వెంటనే ముగించాలని, తూర్పు జెరూసలేంతో సహా ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని ఇజ్రాయెల్‌కు పిలుపునిచ్చింది. అంతేకాదు “పాలస్తీనా ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కుకు మద్దతు”ను కూడా పునరుద్ఘాటించింది.
“ఇటీవలి పరిణామాలు గతంలో కంటే ఎక్కువగా, భయంకరమైన మానవ మరణాలను, మధ్యప్రాచ్య సంఘర్షణ కొనసాగడం వల్ల ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, భద్రతపై తీవ్ర ప్రభావాలను హైలైట్ చేశాయని ప్రకటన పేర్కొంది.
“రెండు-దేశాల పరిష్కారం, బలమైన అంతర్జాతీయ హామీల దిశగా నిర్ణయాత్మక చర్యలు లేకపోవడంతో వివాదం మరింత తీవ్రమవుతుంది, ప్రాంతీయ శాంతి అస్పష్టంగానే ఉంటుంది” అని ఆ ప్రకటన తెలిపింది.
“గాజాలో యుద్ధం ఇప్పుడే ముగియాలి” అని నొక్కి చెబుతూ…”గాజా పాలస్తీనా దేశంలో అంతర్భాగం. వెస్ట్ బ్యాంక్‌తో ఏకం కావాలి. ఆక్రమణ, ముట్టడి, బలవంతపు తరలింపు ఉండకూడదని ఐక్యరాజ్యసమితి ఉద్ఘాటించింది.”