భూపాల్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పురాతనమైన షీట్లమాటా మార్కెట్ అత్యంత ప్రజాదరణ పొందింది. దశాబ్దాలుగా మహిళల దుస్తులకు కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇది ఇప్పుడు రాజకీయాలలో తాజా చర్చనీయాంశంగా మారింది.
స్థానిక బిజెపి ఎమ్మెల్యే కుమారుడు ఏకలవ్య సింగ్ గౌర్ జారీ చేసిన మౌఖిక ఆదేశం… మనుగడ కోసం మార్కెట్‌పై ఆధారపడిన వందలాది మంది ముస్లిం కార్మికులలో ఆగ్రహం, భయం, తీవ్ర అనిశ్చితిని రేకెత్తించింది. వ్యాపారుల ప్రకారం, మార్కెట్‌లోని 501 దుకాణాలలో ఏ ముస్లిం సేల్స్‌మెన్‌ను పని చేయడానికి అనుమతించబోమని గౌర్ ఇటీవల జరిగిన సమావేశంలో ప్రకటించారు.
అంతేకాదు ముస్లిం వ్యాపారులకు ఏదైనా దుకాణాన్ని అద్దెకు ఇస్తే, దానిని రెండు నెలల్లోపు ఖాళీ చేయాలని ఆయన “సూచించారు”. “లవ్ జిహాద్”ను అరికట్టాల్సిన అవసరం ఉందని ప్రతిపాదించారు. ఈ ఆదేశం జీవనోపాధిపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ఈ దుకాణాలలో సంవత్సరాలుగా పనిచేస్తున్న ముస్లిం యువత ఇప్పుడు అకస్మాత్తుగా నిరుద్యోగ ప్రమాదంలో ఉన్నారు.
ఈ విషయమై షీట్లమాటా మార్కెట్ ప్రధాన కార్యదర్శి పప్పు మహేశ్వరితో సమావేశం జరిగిందని, ఆ ఆదేశం ఆమోదించారని ధృవీకరించారు. “షీట్లమాటా మార్కెట్‌లో పనిచేస్తున్న ముస్లిం అబ్బాయిలందరినీ వెంటనే తొలగించాలని, అద్దెకు ఉన్న దుకాణాలను కూడా తొలగించాలని ఆదేశించారు. వారు ఎక్కడ పని చేయాలనుకుంటున్నారో రెండు నెలల్లో నిర్ణయించుకోవడానికి వారికి సమయం ఇచ్చామని” ఆయన అన్నారు.
ముస్లిం సేల్స్‌మెన్‌ను బహిష్కరించినా… ముస్లిం మహిళా కస్టమర్లకు ఎప్పటిలాగే వివక్షత లేకుండా సేవలు అందిస్తామని ఈ వివాదాన్ని చల్లబరిచేందుకు షీట్లమాటా మార్కెట్ ప్రధాన కార్యదర్శి పప్పు మహేశ్వరి ప్రయత్నించారు. అయినప్పటికీ, మార్కెట్ క్లయింట్లలో దాదాపు 50 శాతం మంది ముస్లింలే కావడంతో విమర్శకులు స్పష్టమైన వైరుధ్యాన్ని ఎత్తి చూపారు: ఓవైపు కొనుగోలుదారులుగా ముస్లిం మహిళలను స్వాగతించినప్పటికీ, ముస్లిం యువతను మాత్రం సేల్స్‌మెన్ ఉద్యోగాల నుండి తొలగించడం గమనార్హం.
ఈ సమస్య రాజకీయ వేడిని రగిలించింది. “భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, దాని నాయకులు ఒకే ఎజెండాను స్వీకరించారు, దీనిలో ప్రజలు మతం, సమాజం, కులం పేరుతో ఒకరితో ఒకరు పోరాడవలసి వస్తుంది. ఈ కొత్త పరిణామం ప్రభుత్వ పరిపాలనను నేరుగా సవాలు చేస్తోంది. ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులందరికీ సమాన హక్కులు ఉన్నాయి. సోదరభావం, ఐక్యత భారతదేశానికి పునాది. ఇండోర్ కలెక్టర్, కమిషనర్ ఈ విషయాన్ని గ్రహించి, ఇండోర్ వాతావరణం చెడిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థించింది. ఎటువంటి చర్య తీసుకోకపోతే, కాంగ్రెస్ నగరంలో పెద్ద ఉద్యమాన్ని నిర్వహిస్తుందని” తెలిపింది.