న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU), ఇతర సామాజిక శాస్త్ర కేంద్రాలు గత 10 సంవత్సరాలలో నష్టపోయాయని, వాటి స్థాపనలో పాల్గొన్న వారు ఈ “విధ్వంసం” పట్ల దిగ్భ్రాంతి చెందారని చరిత్రకారిణి రోమిలా థాపర్ అన్నారు.
ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన మూడవ కపిల వాత్స్యాయన్ స్మారక ఉపన్యాసంలో మాట్లాడుతూ… గత దశాబ్దంలో JNUలో విద్యా ప్రమాణాలను కొనసాగించడం “చాలా సమస్యాత్మకం” అని థాపర్ అన్నారు.
“1970లలో JNU స్థాపనలో పాల్గొన్న మనలో కొందరు… గత పదేళ్లలో జరిగిన విధ్వంసం పట్ల దిగ్భ్రాంతి చెందారు. ఇది JNU కి మాత్రమే పరిమితం కాదు, మిగతా సామాజిక శాస్త్ర కేంద్రాలు కూడా నష్టపోయాయి” అని థాపర్ అన్నారు.
స్వదేశంలో, వెలుపల ప్రపంచంలో ఎంతో గౌరవించే విశ్వవిద్యాలయాన్ని స్థాపించడంలో తాము విజయం సాధించామని రోమిలా థాపర్ చెప్పారు.
“…కానీ గత దశాబ్దంలో, విద్యా ప్రమాణాలను నిర్వహించడం చాలా సమస్యాత్మకంగా మారింది. కొంతమంది నాణ్యత లేని ఉపాధ్యాయులను నియమించడం, నిపుణులు కాని వారు పాఠ్యాంశాలు సిలబస్‌ను సెట్ చేయడం, విద్యావేత్తలు అర్థవంతంగా భావించే పరిశోధన, బోధనా స్వేచ్ఛను పరిమితం చేయడం వంటి అనేక విధాలుగా ఇది జరిగింది.”
2020 సంఘటన
జనవరి 2020లో విశ్వవిద్యాలయంలో జరిగిన సాయుధ గుంపు క్యాంపస్‌లోకి చొరబడి విద్యార్థులు, అధ్యాపకులను గాయపరిచిన సంఘటనను ఉదహరిస్తూ, పరిస్థితి “విద్యా వ్యవస్థ పరిధికి మించి” పోయిందని 93 ఏళ్ల థాపర్ అన్నారు.
ఉమర్ ఖలీద్ అరెస్టు గురించి ప్రస్తావించకుండా, “విద్యపై రాజకీయ నియంత్రణ మేధో సృజనాత్మకతను అణచివేస్తుందని” థాపర్ అన్నారు.
“అధికారాన్ని విమర్శించినందుకు విద్యార్థుల అరెస్టులు జరిగాయి, అరెస్టు అయిన వారిలో కొందరు ఇప్పటికీ విచారణ లేకుండా గత ఆరు సంవత్సరాలుగా జైలులో ఉన్నారని ఆమె వాపోయారు.
“మేధోపరమైన విద్యకు స్వేచ్ఛతో ఆలోచించడం అవసరం… ఈ నియంత్రణ అనేది మేధో వ్యతిరేకతకు ప్రబలంగా ఉన్న ప్రాధాన్యత మరో నిదర్శనం. మాటను నిశ్శబ్దం చేయవచ్చు, కానీ ఆలోచనను నిశ్శబ్దం చేయలేమని” రోమిలా థాపర్ అన్నారు.
కాగా, భారతదేశంలో చరిత్ర విద్య, ప్రస్తుత పద్ధతులను కూడా ఆమె విమర్శించారు, “దేశంలో చరిత్రపై సాధారణ జ్ఞానం లేకపోవడం వల్ల చరిత్ర సులభమైన లక్ష్యంగా” మారిందని అన్నారు. “ఇది ప్రొఫెషనల్ చరిత్రకారులకు ఆమోదయోగ్యం కాదు, కానీ సాధారణ ప్రజలు దీన్ని అంగీకరిస్తారు. బహుశా ఈ దేశంలో చరిత్రపై సరియై జ్ఞానం లేకపోవడం వల్లనే ఇలా జరుగుతుందని ఆమె అన్నారు.”
“శాస్త్రాలు, మరింత సాంకేతికంగా ఉండటం వల్ల ఊహాజనితమైనవి కావు. సామాజిక శాస్త్రాలు సమాజాలు ఎలా పనిచేస్తాయో విశ్లేషిస్తాయి. దీంతో చరిత్ర సులభమైన లక్ష్యంగా” మారిందని థాపర్ అన్నారు.