భువనేశ్వర్: ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా ఖండదేయులా గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. ఉదయం ప్రార్థనల తర్వాత గౌరవ సూచకంగా తన పాదాలను తాకనందుకు ఆ టీచర్ విద్యార్థులను వెదురు కర్రతో కొట్టారు. దీంత అనేక మంది గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే…ఒడిశాలో సెప్టెంబర్ 11న ఈ దిగ్భ్రాంతికర ఘటన జరిగింది. 31 మంది విద్యార్థులను దారుణంగా కొట్టినందుకు అసిస్టెంట్ టీచర్ సుకాంతి కర్ను సస్పెండ్ చేశారు.
6, 7, 8 తరగతుల విద్యార్థులు ప్రార్థనా సెషన్ ముగించుకొని..తరగతులకు హాజరుకావడానికి బయలుదేరినప్పుడు ఈ సంఘటన జరిగింది. పాదాభివందనం చేయకపోవంతో మనస్తాపం చెందిన ఆ టీచర్ వారి తరగతి గదుల్లోకి ప్రవేశించి, తన పాదాలను తాకని వారిని వరుసలో నిలబడమని ఆదేశించింది.
ఆ తరువాత ఆమె వారిని కొట్టింది, దీంతో వారికి గాయాలయ్యాయి. ఒక విద్యార్థికి ప్రథమ చికిత్స అవసరం ఏర్పడింది, ఒక బాలిక కొద్దిసేపు స్పృహ కోల్పోయింది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు ఆగ్రహించి పాఠశాలకు చేరుకుని టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
స్థానిక విద్యా అధికారుల విచారణ తర్వాత బెట్నోయ్ బ్లాక్‌కు చెందిన బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO) బిప్లాప్ కర్ ఈ కేసును పరిశీలించారు. ప్రధానోపాధ్యాయుడు పూర్ణచంద్ర ఓఝా, CRCC దేబాషిష్ సాహు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు నిర్వహించిన దర్యాప్తులో గాయపడిన విద్యార్థుల వాంగ్మూలాలు ఉన్నాయి. విచారణలో ఉపాధ్యాయురాలి చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు, దీని ఫలితంగా ఆమె వెంటనే సస్పెన్షన్‌కు గురైంది.
అనేక మంది విద్యార్థుల చేతులపై గాయాలు కనిపించాయని BEO నివేదించారు, ఇది దాడి తీవ్రతను హైలైట్ చేస్తుంది. గాయపడిన విద్యార్థులను వెంటనే చికిత్స కోసం బెట్నోయ్ ఆసుపత్రికి తరలించారు.
ఈ సంఘటన చాలామంది ఖండించారు. చిన్న విషయానికి టీచర్ బెత్తంతో కొట్టడాన్ని తల్లిదండ్రులు, అధికారులు విమర్శించారు. కాగా, ఈ సంఘటన పాఠశాలల్లో ఉపాధ్యాయుల ప్రవర్తన, విద్యార్థుల భద్రత గురించి విస్తృత ఆందోళనలను లేవనెత్తుతుంది. జవాబుదారీతనం నిర్ధారించడానికి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు కేసును నిశితంగా పర్యవేక్షించాలని భావిస్తున్నారు.