హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోలో సిబ్బంది సంఖ్య తగ్గడం, స్టేషన్లలో పెద్దగా అలికిడి లేకపోవడం వల్ల రాత్రిపూట చాలా మంది మహిళలు సురక్షితంగా లేరని ఒక అధ్యయనం పేర్కొంది. నగరంలోని ఈథేమ్స్ బిజినెస్ స్కూల్ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. దీనికి బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సహేరా ఫాతిమా, విద్యార్థులు అమెనా బేగం, ఖతీజా తుల్ కుబ్రా, తరుణి రెడ్డి, సుఖ్‌జోత్ సింగ్ చావల్ నాయకత్వం వహించారు.
కాగా, ఈథేమ్స్ బిజినెస్ స్కూల్ విడుదల చేసిన ఈ నివేదికలో “హైదరాబాద్ మెట్రో ట్రాన్సిట్‌లో మహిళల భద్రత” పేరిట ప్రచురించిన శ్వేతపత్రం… మెట్రోలో మహిళా ప్రయాణికులు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రధానంగా ప్రస్తావించింది. దీనికి పేలవమైన లైటింగ్, కాంకోర్స్‌లో తగినంత మౌలిక సదుపాయాలు లేకపోవడం, అందుబాటులో టాయిలెట్లు లేకపోవడాన్ని ఆ అధ్యయనం కారణాలుగా చూపింది. 11 శాతం మంది మహిళలు తమ మెట్రో ప్రయాణంలో వేధింపులను ఎదుర్కొన్నామని కూడా పేర్కొన్నారు.
మహిళలు మాత్రమే ప్రయాణించే కోచ్‌లలోకి పురుషులు ప్రవేశించడం, CCTV కవరేజ్ లేకపోవడం వంటి ఇతర సమస్యలు కూడా ఎదుర్కొంటున్నట్లు మహిళలు తెలిపారు. మెట్రోలో ప్రయాణించే 70 శాతం మంది మహిళలు పగటిపూట సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నప్పటికీ, రాత్రి సమయంలో ఇబ్బందులున్నాయని పేర్కొంది. ఈ అధ్యయనం కోసం పరిశోధన బృందం హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే 410 మంది మహిళలను ఇంటర్వ్యూ చేసింది.
ఈ మేరకు మెట్రోలో మహిళల భద్రతను మెరుగుపరిచేందుకు వీలుగా మహిళా సిబ్బంది సంఖ్య పెంచడం, మెరుగైన లైటింగ్ ఏర్పాటు చేయడం, CCTV కవరేజిని పెంచడం వంటి చర్యలను చేపట్టాలని నివేదిక సిఫార్సు చేసింది.