24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి బరిలో గెహ్లాట్, థరూర్!

న్యూఢిల్లీ:  దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి సిసలైన ఎన్నిక జరగబోతోంది. గాంధీయేతర వ్యక్తి ఈసారి పార్టీ అధ్యక్షుడు కానున్నారు.  కాంగ్రెస్ పార్టీలో సర్వోన్నత పదవికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, తిరువనంతపురం లోక్ సభ సభ్యుడు శశి థరూర్ పోటీ పడనున్నారు. గెహ్లాట్ గాంధీ కుటుంబానికి నమ్మిన బంటు కాగా, థరూర్ రెండున్నర ఏళ్ళ కింద సోనియాగాంధీని పార్టీలో సంస్కరణలు ప్రవేశపెట్టాలని కోరుతూ లేఖ రాసిన 23 మంది నాయకుల సమూహంలో ఒకరు. సోమవారం ఉదయం సైతం పార్టీలో సంస్కరణలు పెద్ద ఎత్తున జరగాలంటూ యువకాంగ్రెస్ నాయకులు వందల సంఖ్యలో సంతకాలు చేసిన విజ్ఞాపన పత్రంపైన శశిథరూర్ కూడా సంతకం చేశారు.

వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన సోనియా గాంధీని శశి థరూర్ సోమవారం మధ్యాహ్నం కలుసుకున్నారు  అక్టోబర్ 17 ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమె అనుమతిని కూడా పొందారు. మరి కొన్ని గంటల్లోనే, అశోక్ గెహ్లాట్ తాను కూడా  కాంగ్రెస్ అత్యున్నత పదవి కోసం పోటీలో నిలిచారు. దీంతో పోరు చాలా కఠినంగా మారింది.

రాజస్థాన్ ముఖ్యమంత్రి, గాంధీ కుటుంబ విధేయుడు. రాహుల్ గాంధీ తిరిగి పార్టీ చీఫ్‌గా రావాలని కోరుకుంటున్న వారిలో  ఈయన అగ్రగణ్యుడు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి గట్టి మద్దతుదారు అయిన అశోక్‌ గెహ్లాట్‌కే మద్దతు లభించే అవకాశం ఉంది.

ఇదిలాఉండగా “పోటీ చేయాలనుకునే వారెవరికైనా స్వేచ్ఛ ఉంది. అధ్యక్షపదవికి పోటీ పడటాన్ని స్వాగతిస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్య పారదర్శక ప్రక్రియ ద్వారా ఎన్నిక నిర్వహిస్తాం. అధ్యక్ష పదివకి పోటీ చేయడానికి ఎవరి ఆమోదం అవసరం లేదు” అని కాంగ్రెస్ ఎంపీ, పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ అన్నారు. మరో మూడు రోజుల్లో అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. గత ఏడాది కాలంగా పలువురు కీలక నేతలు కాంగ్రెస్‌ నుంచి వైదొలిగిన నేపథ్యంలో ఈ ఎన్నికలు జరగనుండడం విశేషం.

1998లో సోనియాగాంధీ పార్టీ అధినేత్రిగా 2017వరకు పదవిలో ఉన్నారు. అప్పటినుంచి  2019వరకు రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే 2019 లో పార్టీ ఘోరపరాజయం పాలుకావడంతో రాహుల్ నైతిక బాధ్యత స్వీకరించి పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. అప్పుడు తిరిగి పార్టీ నిర్వహణ బాధ్యతను అనారోగ్యంతో సతమతం అవుతున్నప్పటికీ సోనియాగాంధీ స్వీకరించవలసి వచ్చింది. కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఆ పార్టీ చరిత్రలోనే అత్యంత దీర్ఘకాలం ఉన్న వ్యక్తిగా సోనియాగాంధీ చరిత్ర పుటలలోకి  ఎక్కారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని తిరిగి స్వీకరించమని రాహుల్ ని కోరుతూ అరడజను పీసీసీలు తీర్మానాలు చేశాయి. కానీ  రాహుల్ ససేమిరా అన్నారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇలాంటి అభ్యర్థనలు మరిన్ని వచ్చే అవకాశం ఉంది. పార్టీలోని చాలా మంది దీనిని ఎన్నికలతో లేదా ఎన్నికలు లేకుండా గాంధీలను ఇన్‌ఛార్జ్‌గా ఉంచే ప్రయత్నంగా భావిస్తున్నారు.

చాలా రాష్ట్రాల్లో ప్రైమ్ స్పేస్ కోసం పోటీ పడుతున్న తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి ప్రతిపక్ష పార్టీలకు కాంగ్రెస్ అస్థిరమైన పతనం ఒక వరంలా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న గుజరాత్‌లో కాంగ్రెస్ పని ‘అయిందని’ కేజ్రీవాల్ గత వారం ప్రకటించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles