బెంగళూరు: కర్ణాటక కుల సర్వేలో మైనారిటీలను చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఫిర్యాదులు దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థించారు. క్రైస్తవులు-ముస్లింలు భారతీయ పౌరులని అన్నారు. మీడియాతో మాట్లాడుతూ, “సర్వే కోసం ప్రభుత్వం 1.75 లక్షల మంది ఉపాధ్యాయులను నియమించింది. వారు సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 7 వరకు ప్రతి ఇంటినీ సందర్శిస్తారని సీఎం అన్నారు.”
ఇదిలా ఉండగా… సర్వే ద్వారా మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారని బిజెపి ఆరోపించింది. సర్వేలో చేర్చిన ‘నాస్తికుడు’ అన్న కాలమ్పై బిజెపి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీనిపై సీఎం సిద్దూ స్పందిస్తూ, “బిజెపి ఈ విషయాన్ని రాజకీయం చేస్తోంది. ప్రభుత్వం పౌరుల ఆర్థిక, సామాజిక, విద్యా స్థితిని తెలుసుకోవాలి. ఇది భవిష్యత్తులో ప్రణాళికలను రూపొందించడానికి ప్రభుత్వానికి సహాయపడుతుంది” అని అన్నారు. క్రైస్తవులు, ముస్లింలను కులగణనలో చేర్చడాన్ని సమర్థిస్తూ, “వారు కూడా ఈ దేశ పౌరులే. వారిని చేర్చాలి” సీఎం సిద్ధరామయ్య అన్నారు.
కర్ణాటకలో ‘కులగణన’గా ప్రసిద్ధిగాంచిన రాష్ట్ర సామాజిక విద్యాసర్వేను చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి గత వారం సిద్ధరామయ్య ప్రకటించారు. 420 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ సర్వేను జూన్ 12న కర్ణాటక మంత్రివర్గం ఆమోదించినట్లు తెలిపారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 7 మధ్య సర్వే నిర్వహిస్తామన్న సీఎం… పూర్తి శాస్త్రీయంగా దీన్ని పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.
సర్వేలో మొత్తం 60ప్రశ్నలు ఉంటాయన్న కర్ణాటక ముఖ్యమంత్రి 7 కోట్లమంది ప్రజల సామాజిక విద్యా పరిస్థితిని అంచనా వేసేందుకు ఇది తోడ్పడుతుందన్నారు. రాష్ట్ర వెనకబడిన వర్గాల కమిషన్ ఛైర్మన్ మధుసుదన్ నాయక్ నేతృత్వంలో సర్వే చేసి డిసెంబర్‌లోగా రిపోర్టును కమిషన్ ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది.
కాగా, 2015లో చేపట్టిన సోషల్ అండ్ ఎడ్యుకేషన్ సర్వే అశాస్త్రీయంగా జరిగిందంటూ ఆధిపత్య వొక్కలిగలు, వీర శైవ లింగాయత్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త సర్వే కోసం డిమాండ్ చేయడంతో ఆ సర్వేను రద్దు చేశారు. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, ఇతర నేతల ఆదేశాలతో కొత్త సర్వే నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది.