న్యూఢిల్లీ: ఓట్లచోరీ అంశంపై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణ చేశారు. ఓటర్ల పేర్ల తొలగింపు ప్రజాస్వామ్యంపై పడిన అణుబాంబు అని ఆయన అన్నారు. ఎన్నికల సంఘం(ఇసి) ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తోందంటూ ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
కర్ణాటక, మహారాష్ట్రలోని ఎంపిక చేసిన నియోజకవర్గాలలో ఓటర్లను తప్పుగా చేర్చడం, తొలగించడం గురించి ఆయన తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషన్ (ఈసీ) పోర్టల్లలో నకిలీ లాగిన్లను సృష్టించే సాఫ్ట్వేర్ ద్వారా అటువంటి తొలగింపులు,చేర్పులు కేంద్రీకృత మార్గంలో జరుగుతున్నాయని ఆయన తన తాజాగా ఆరోపించారు.
ఈ తీవ్రమైన ఆరోపణలు భారత ఎన్నికల ప్రజాస్వామ్య పునాదిని తాకుతాయి. ఓటరు జాబితాలను తారుమారు చేయడానికి ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం నిజమని నిరూపితమైతే, రాహుల్ “ఓటు దొంగతనం” ప్రచారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళుతుంది, ఎందుకంటే రాహుల్ గాంధీ ఇప్పుడు ఎన్నికల రిగ్గింగ్‌లో వ్యవస్థీకృత ప్రయత్నం గురించి మాత్రమే కాకుండా, పౌరుల రాజకీయ ప్రాధాన్యతలను పర్యవేక్షించడానికి సాధ్యమయ్యే ‘పనోప్టికాన్’ కాన్సెప్ట్‌ను కూడా చర్చించడం ప్రారంభించారు. ఎన్నికల కమిషన్ బహుశా దీనికి పాల్పడి ఉండవచ్చు.
ఈ ఓట్ల చోరీ వెనక ఎన్నికల కమిషన్ పాత్ర ఉందని.. ముఖ్యంగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కుట్రదారులకు సాయం చేస్తున్నారని పేర్కొన్నారు. 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో.. భారీగా ఓట్లను తొలగించారని ఆరోపించారు. మరీ ముఖ్యంగా ఆలంద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు జరిగినట్లు చెప్పారు. కర్ణాటక బయటి నుంచి నకిలీ లాగిన్లు, ఫోన్ నంబర్లను ఉపయోగించి ఓట్లను తొలగించారని.. ఇది ఒక సెంట్రల్ సాఫ్ట్వేర్ ద్వారా జరిగినట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఒక్క కర్నాటక లోని ఆలంద్ నియోజకవర్గంలో 6,018 ఓట్లను నకిలీ లాగిన్, ఫోన్ నెంబర్లను ఉపయోగించి తొలగించారని తెలిపారు. 14 నిమిషాల్లో 12 మంది ఓటర్లను తొలగించారని ఆరోపించిన సూర్యకంత్ అనే వ్యక్తిని రాహుల్ గాంధీ ఉదహరించారు. ”తొల గించిన” ఓటర్లలో ఒకరైన బాబిటా చౌదరిని ఆయన వేదికపైకి తీసుకువచ్చారు. నాగరాజ్ అనే వ్యక్తి ఉదయం 4:07 వద్ద కేవలం 38 సెకన్లలో రెండు డిలెట్ అప్లికేషన్లు నింపాడని ఆరోపించారు. ఇది ”మానవీయంగా అసాధ్యం” అని రాహుల్ గాంధీ అన్నారు.
రాహుల్ గాంధీ మహారాష్ట్రకు చెందిన రాజురా అసెంబ్లీలో నకిలీ ఓటర్ల చేర్పులను వివరించారు. విచిత్రమైన ఎంట్రీలతో ఈ ఓటర్ల చేర్పులు జరిగాయని అన్నారు. అందులో ఒకటి ఓటరు పేరు:”వైయూహెచ్ యూక్యూజేజేడబ్ల్యూ”, చిరునామా : ”షష్టి, షష్టి” అని రాహుల్ గాంధీ ఉదహరించారు. ఈ ప్రక్రియలో దుండగులు సాఫ్ట్‌వేర్‌ను హైజాక్ చేశారని తెలిపారు. నకిలీ అప్లికేషన్లు, తప్పుడు ఫోన్ నంబర్లు ఉపయోగించి ఓట్ల తొలగింపునకు అప్పీల్ చేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశమున్న బూత్‌లను లక్ష్యంగా చేసుకుని ఈ ఓట్ల తొలగింపు జరిగిందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ చర్యలు తమ పార్టీని బలహీనపరచడానికి జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ మొత్తం వ్యవహారం చిన్న స్థాయిలో కాకుండా, పెద్ద ఎత్తున జరిగిందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ తొలగింపులపై ఎన్నికల సంఘం స్పందించకపోతే, అది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే వారిని కాపాడుతున్నట్టు అవుతుందని ఆయన హెచ్చరించారు. ఈసీ ఒక వారంలోపు తీసివేసిన ఓటర్ల వివరాలు, వాటికి ఉపయోగించిన ఫోన్లు, ఓటీపీల సమాచారం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఇది మరోసారి ఓట్ల చోరీకి నిదర్శనమవుతుందని రాహుల్ గాంధీ అన్నారు.
సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఓట్లను తొలగిస్తున్నారంటూ రాహుల్ గాంధీ చేసిన విమర్శలను కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో ఖండించింది. అదంతా నిరాధార, అసత్య ప్రచారమని పేర్కొంది. ఆన్లైన్ వేదికగా ఓట్లను తొలగించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. 2023లో అలంద్ అసెంబ్లీ నియోజవర్గంలో ఓటర్ల తొలగింపునకు విఫల ప్రయత్నాలు జరిగాయి. ఆ వ్యవహారంపై దర్యాప్తు కోసం ఎన్నికల సంఘమే ఫిర్యాదు చేసింది. రికార్డుల ప్రకారం.. అలంద్ అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. 2023లో కాంగ్రెస్ నేత బీఆర్ పాటిల్ గెలుపొందారు” అని ఈసీ పేర్కొంది.
కాగా, ఆలంద్ నియోజకవర్గంలోని ఒక బూత్ స్థాయి అధికారి.. తన కుటుంబ సభ్యుల ఓటు తొలగించారని గుర్తించడంతో.. ఈ ఓట్ల చోరీ మోసం వెలుగులోకి వచ్చిందని రాహుల్ గాంధీ తెలిపారు. అనంతరం దానిపై విచారణ జరపగా.. దాని వెనుక ఒక వ్యవస్థీకృత కుట్ర ఉందని తెలిసినట్లు చెప్పారు. ఈ ఓట్ల చోరీపై గత 18 నెలల్లో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కర్ణాటక సీఐడీ.. 18 లేఖలు రాసినా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందించడం లేదని ఆరోపించారు.