Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి ఇవ్వాలన్న ట్రంప్ డిమాండ్‌ను తిరస్కరించిన తాలిబన్!

Share It:

కాబూల్‌: ఆప్ఘనిస్తాన్‌లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి అప్పగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన డిమాండ్‌ను తాలిబన్‌లు నిర్ద్వందంగా తిరస్కరించారు. ఈ ఒప్పందం “సాధ్యం కాదు” అని ఆఫ్ఘన్ ప్రభుత్వ రక్షణ అధికారి ఒకరు అన్నారు.

రాజధాని కాబూల్‌కు ఉత్తరాన ఉన్న బాగ్రామ్ ఆఫ్ఘనిస్థాన్‌లో అతిపెద్ద వైమానిక స్థావరం. రెండు దశాబ్దాలు తాలిబన్లతో యుద్ధంలో అమెరికా సైనిక కార్యకలాపాలకు ఇది ప్రధాన కేంద్రంగా ఉంది. నాలుగేళ్ల కిందట అమెరికా సేనలు అఫ్గన్ నుంచి వైదొలగాయి. మళ్లీ ఈ స్థావరాన్ని తిరిగి ఇవ్వకపోతే అఫ్గన్ తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోక తప్పదని ట్రంప్ హెచ్చరించారు.

కాగా, ‘ఆఫ్గనిస్థాన్‌లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని అమెరికా నిర్మించింది.. దానిని తిరిగి మాకు అప్పగించకపోతే చెడు జరగబోతోంది” అంటూ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. ఈ బెదిరింపులపై ట్రంప్ ఇటీవల అప్ఘానిస్థాన్ రక్షణ శాఖ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫసీహుద్దీన్ ఫిత్రత్ స్పందించారు. ఏదోక రాజకీయ ఒప్పందం ద్వారా ఈ స్థావరాన్ని కొందరు మళ్లీ దక్కించుకోవాలని చూస్తున్నట్టు తెలిపారు. చర్చలు కూడా జరుపుతున్నామని వాళ్లు చెప్పుకుంటున్నారు. అయితే అప్ఘాన్ భూభాగానికి చెందిన ఒక అంగుళం నేలపైనా ఎలాంటి డీల్ కుదరదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో అప్థానిస్థాన్ ప్రభుత్వం కూడా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తమ స్వాతంత్య్రానికి, ప్రాదేశిక సమగ్రతకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తామని పేర్కొంది.

చైనాకు సమీపంగా ఉన్న ఈ స్థావరాన్ని వదిలివేయడంపై ట్రంప్ పదే పదే విమర్శిస్తున్నారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న ట్రంప్.. అమెరికా దానిని తిరిగి తన ఆధీనంలోకి తీసుకోవాలనే ఆలోచనను బహిరంగంగా లేవనెత్తారు.

జో బిడెన్ అధ్యక్షతన, 2020లో ట్రంప్ మధ్యవర్తిత్వంలో తాలిబాన్ తిరుగుబాటుదారులతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా, యుఎస్,నాటో దళాలు బాగ్రామ్ నుండి వైదొలిగాయి. కీలకమైన వైమానిక శక్తిని కోల్పోవడం వల్ల కొన్ని వారాల తర్వాత ఆఫ్ఘన్ సైన్యం కూలిపోయింది. తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చారు.

బాగ్రామ్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి యుఎస్ దళాలను పంపాలని ఆలోచిస్తున్నారా అని వైట్ హౌస్ వద్ద విలేకరులు ట్రంప్‌ను అడిగారు. “మేము దాని గురించి మాట్లాడము, కానీ మేము ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌తో మాట్లాడుతున్నాము, మేము దానిని తిరిగి కోరుకుంటున్నాము. వారు ఆ స్థావరాన్ని మాకు తిరిగి అప్పగించకపోతే నేను ఏమి చేయబోతున్నానో మీరే ఊహించుకోండని ట్రంప్‌ అన్నారు.

అసలు వైమానిక స్థావరం 1950ల ప్రారంభంలో సోవియట్ యూనియన్ సహాయంతో నిర్మితమైంది. యుద్ధ సమయంలో యుఎస్ సహాయంతో విస్తరించారు. దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్తాన్‌ను సోవియట్ ఆక్రమించిన సమయంలో మాస్కో ద్వారా ఈ వైమానిక స్థావరాన్ని గణనీయంగా అభివృద్ధి చేశారు.

2010లో అమెరికా నియంత్రణ ఉన్నప్పుడు, బాగ్రామ్‌ వైమానిక స్థావరం ఒక చిన్న పట్టణం పరిమాణానికి పెరిగింది, సూపర్ మార్కెట్లు, డైరీ క్వీన్, బర్గర్ కింగ్ వంటి అవుట్‌లెట్‌లతో సహా మరెన్నో దుకాణాలు ఉన్నాయి. 2012లో బరాక్ ఒబామా, 2019లో ట్రంప్‌తో సహా అనేక మంది అమెరికా అధ్యక్షులు దీనిని సందర్శించారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.