లేహ్/న్యూఢిల్లీ: లడఖ్‌లో జరిగిన ఘర్షణలకు సోనమ్ వాంగ్‌చుక్ వ్యాఖ్యలే కారణమని కేంద్రం ఆరోపించింది. ఈ ఘర్షణల్లో నలుగురు మరణించారు. 70 మంది గాయపడ్డారు. “నిరాహార దీక్షను విరమించాలని చాలా మంది నాయకులు కోరినప్పటికీ, వాంగ్‌చుక్ కొనసాగించాడు. “అరబ్ స్ప్రింగ్, నేపాల్ తరహా నిరసనలు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజలను రెచ్చగొట్టాయని హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
నిన్న ఉదయం 11:30 గంటల సమయంలో, వాంగ్‌చుక్ ప్రసంగాలతో ప్రేరేపితులైన ఆందోళనకారులు దీక్షా శిబిరం నుంచి దూసుకొచ్చి ఒక రాజకీయ పార్టీ కార్యాలయానికి, ప్రభుత్వ కార్యాలయానికి నిప్పు పెట్టారని హోం శాఖ తన ప్రకటనలో వివరించింది. భద్రతా సిబ్బందిపై దాడి చేయడంతో పాటు, పోలీసు వాహనాన్ని కూడా దగ్ధం చేశారని తెలిపింది. ఈ ఘర్షణల్లో 30 మందికి పైగా పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారని వెల్లడించింది. అదుపుతప్పిన గుంపును నియంత్రించేందుకు, ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని, ఈ క్రమంలో దురదృష్టవశాత్తు కొందరు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.
లడఖ్‌లో పరిస్థితి దానంతట అదే అదుపు తప్పలేదని; దీనిని ఉద్దేశపూర్వకంగా రూపొందించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొంతమంది వ్యక్తులు ఆడిన సంకుచిత రాజకీయాలకు, కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ వ్యక్తిగత ఆశయాలకు లడఖ్ యువ జనాభా భారీ మూల్యం చెల్లిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి.
లడఖ్ యువతను తప్పుదారి పట్టించి, రాజకీయ, వ్యక్తిగత లాభం కోసం దుష్ట కుట్రలో చిక్కుకున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి, లడఖ్ ప్రజల సంక్షేమం, సాధికారతకు కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు.
కేంద్రపాలిత ప్రాంతంలో రాష్ట్ర హోదా కోరుతూ నిరసనకారులు పోలీసులతో హింసాత్మకంగా ఘర్షణ పడగా, వారిలో ఒక వర్గం లడఖ్ హిల్ కౌన్సిల్ అసెంబ్లీ హాలుకు నిప్పు పెట్టారని లేహ్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. గుంపు రాళ్లు రువ్వడంతో 50 మంది భద్రతా దళ సిబ్బంది గాయపడ్డారని తెలిపింది..
లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా, 6వ షెడ్యూల్‌లో చేర్చాలన్న డిమాండ్లతో సోనమ్ వాంగ్‌చుక్ ఈ నెల 10 నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. అపెక్స్ బాడీ, లేహ్ (ABL), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (KDA) లేవనెత్తిన అంశాలను చర్చించడానికి కేంద్రం అక్టోబర్ 6న ఉన్నత స్థాయి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ABL ప్రతిపాదించిన విధంగా ఉన్నత స్థాయి కమిటీకి కొత్త సభ్యులను కూడా అంగీకరించింది.
అయితే, కొన్ని సమావేశాలను ముందుకు తీసుకెళ్లాలని అభ్యర్థనలు వచ్చిన తర్వాత సెప్టెంబర్ 25-26 తేదీలలో నిర్వహించాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి, వాస్తవానికి కేంద్రం ఎల్లప్పుడూ చర్చలకు సిద్ధంగా ఉందని చెప్పారు. జూలై 25న చర్చలు జరపాలని గతంలో ప్రతిపాదించినప్పటికీ, దానికి సానుకూల స్పందన రాలేదని వారు ఎత్తి చూపారు.
లద్దాఖ్ నేతలతో ఉన్నతస్థాయి కమిటీ (హెచ్‌పీసీ) ద్వారా చర్చలు సజావుగా సాగుతున్నాయని, ఇప్పటికే గిరిజనుల రిజర్వేషన్లను 45% నుంచి 84% శాతానికి పెంచడం, కౌన్సిళ్లలో మహిళలకు 1/3 రిజర్వేషన్లు కల్పించడం వంటి అనేక సానుకూల నిర్ణయాలు తీసుకున్నామని కేంద్రం తెలిపింది. చర్చల ప్రక్రియను దెబ్బతీయడానికే కొందరు రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. హింస జరుగుతున్న సమయంలోనే వాంగ్‌చుక్ తన దీక్షను విరమించడం గమనార్హమని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం లేహ్‌లో కర్ఫ్యూ విధించామని, సాయంత్రం 4 గంటల కల్లా పరిస్థితిని అదుపులోకి తెచ్చామని హోం శాఖ స్పష్టం చేసింది. లద్దాఖ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చింది.