ఏథెన్స్: మానవతా సహాయం, అంతర్జాతీయ కార్యకర్తలతో గాజాకు వెళ్తున్న గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా (GSF) గ్రీకు తీరం సమీపంలో ప్రయాణిస్తున్నప్పుడు పదిహేనుసార్లు డ్రోన్ దాడులకు గురైనట్లు తెలిపింది. ఈమేరకు సోషల్ మీడియాలో వారు పోస్ట్ కూడా చేసారు. సెప్టెంబర్ 23 – సెప్టెంబర్ 24 బుధవారం తెల్లవారుజాము వరకు 15కి పైగా డ్రోన్లు ఫ్లోటిల్లా నౌకలను లక్ష్యంగా చేసుకున్నాయని నిర్వాహకులు తెలిపారు.
పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఎనిమిది పడవలపై కనీసం తొమ్మిది దాడులలో కమ్యూనికేషన్లు నిలిచిపోయాయి. ఇలాంటి దాడులకు తాము బెదిరిపోమని, ఇలాంటి చౌకబారు ఎత్తుగడలు మమ్మల్ని లక్ష్యం నుండి నిరోధించవు అని నిర్వాహకులు ప్రకటించారు. ఈ మేరకు తమ నౌకలను రక్షించాలని గ్రీకు కోస్ట్‌గార్డ్‌ను అభ్యర్థించారు.
కాగా, సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేసిన వీడియోలు సముద్రంలో పేలుళ్లను చూపడంతో…మానవతా కార్యకర్తలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు.
క్రీట్ సమీపంలో నౌకాయానం చేస్తున్న గ్రెగ్ స్టోకర్ మాట్లాడుతూ… ఒక క్వాడ్‌కాప్టర్ తన డెక్‌పై ఒక గుర్తుతెలియని పరికరాన్ని పడవేసినట్లు ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో చెప్పాడు. “మా VHF రేడియోను శత్రువుల కమ్యూనికేషన్లు హైజాక్ చేశాయని అతను తెలిపాడు.
జర్మన్ మానవ హక్కుల కార్యకర్త యాసేమిన్ అకార్ ఐదు పడవలపై దాడి జరిగిందని ధృవీకరించారు. “మా దగ్గర మానవతా సహాయం మాత్రమే ఉంది. మా దగ్గర ఆయుధాలు లేవని ఆమె ఒక వీడియోలో చెప్పింది.
ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోకు క్యాప్షన్ కూడా ఇచ్చింది, “సుముద్ ఫ్లోటిల్లా యూరప్ తీరంలో బాంబు దాడికి గురయ్యారు. ఇది కేవలం ఫ్లోటిల్లాపై దాడి కాదు, ఇది మానవత్వంపై దాడి. మేము గాజాకు సహాయం అందించే అహింసా మానవతా మిషన్. వారు డ్రోన్లు, పేలుడు పదార్థాలతో మమ్మల్ని ఆపడానికి ప్రయత్నించారు. మేము నిశ్శబ్దంగా ఉండము. మేము వెనక్కి తగ్గమని చెప్పారు.
మాకు”సంకల్పం బలంగా ఉంది, మేము ఎవరికి తలవంచము, మా ధైర్యం ఉన్నతంగా ఉంది. మేము గాజాకు చేరుకుంటాము” అని అన్నారు.
“గాజా కోసం గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా శాంతియుత, చట్టబద్ధమైన మానవతా సహాయ కాన్వాయ్‌పై ఇజ్రాయెల్ జాత్యహంకార డ్రోన్ దాడులను ప్రపంచ సమాజం గమనించాలి. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తాలి. గాజా, మేము వస్తున్నామని ఈ దళంలో ఉన్న పాకిస్తాన్ మాజీ సెనేటర్ ముష్తాక్ అహ్మద్ ఖాన్ అన్నారు.”
ఫ్రాన్స్-పాలస్తీనా MEP రిమా హసన్ కూడా సోషల్ మీడియా ద్వారా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు విజ్ఞప్తి చేశారు, అనేక డజన్ల మంది ఫ్రెంచ్ జాతీయులు దళంలో ఉన్నారని, దాడులను నిలిపివేయాలని కోరారు.
డ్రోన్ దాడులు, పేలుళ్లు లేదా కమ్యూనికేషన్ జామింగ్ నివేదికలపై ఇజ్రాయెల్ వ్యాఖ్యానించలేదు. అయితే, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ దళం “హింసాత్మక చర్యను అనుసరిస్తోందని” ఆరోపించింది. దాని సభ్యులు “గాజాలోని ప్రజలకు బదులుగా హమాస్‌కు సేవ చేస్తున్నారని” పేర్కొంది.
కాగా, 51 పడవలతో కూడిన ఫ్లోటిల్లా, ఆగస్టు 31న బార్సిలోనా నుండి గాజాకు మానవతా సామాగ్రిని అందించాలనే లక్ష్యంతో బయలుదేరింది. వాతావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్, UN ప్రత్యేక నివేదికదారు ఫ్రాన్సిస్కా అల్బనీస్ వంటి ఉన్నత స్థాయి వ్యక్తులు ఫ్లోటిల్లాలో భాగమయ్యారు.