Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

సోనమ్ వాంగ్‌చుక్‌పై జాతీయ భద్రతా చట్టం…జోధ్‌పూర్‌ జైలుకు తరలింపు!

Share It:

న్యూఢిల్లీ: ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్‌ను క్రూరమైన జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసి… వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న జోధ్‌పూర్‌కు ప్రభుత్వం తరలించింది. లద్దాఖ్ రాజధాని లేహ్‌లో బుధవారం జరిగిన హింసాకాండలో నలుగురు మరణించగా, 70 మంది గాయపడిన సంగతి తెలిసిందే. యువతను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించాడన్న కారణంతో జాతీయ భద్రతా చట్టం(NSA) కింద డిజీపీ ఎస్.డి.సింగ్ జమ్వాల్ ఆధ్వర్యంలో సోనమ్ వాంగ్‌చుక్‌ను ఆయన సొంత గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా ఉన్న లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని, దానిని గిరిజన హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆయన కొన్నేళ్లుగా పోరాటం కొనసాగిస్తున్నారు. కాగా, వాంగ్‌చుక్ స్వచ్ఛంద సంస్థ అయిన ‘స్టూడెంట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లద్దాఖ్’ (SECMOL) లైసెన్స్‌ను హోం శాఖ గురువారం నాడు రద్దు చేసింది. ఆ సంస్థకు విరాళాలు నిలిపివేసింది.

మరోవైపు, ఈ అంశంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ కూడా విచారణ జరపనున్నట్టు తెలుస్తోంది. సీబీఐ గత రెండు నెలలుగా ప్రాథమిక దర్యాప్తు కూడా జరిపింది. వాంగ్‌చుక్ సంస్థ ఎఫ్‌సీఆర్ఏ నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. అరబ్ స్ప్రింగ్, నేపాల్ ‘జెన్ జడ్’ నిరసనలను తన ప్రసంగంలో వాంగ్‌చుక్ ప్రస్తావిస్తూ లెహ్‌లోని యువతను రెచ్చగొట్టారని హోం మంత్రిత్వ శాఖ ఆరోపించింది.

కాగా, కేంద్ర ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలను వాంగ్‌చుక్ తోసిపుచ్చారు. హింస వెనుక తన ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. ప్రజల డిమాండ్లను నెరవేర్చకుండా వారి దృష్టిని మళ్లించడానికే తనపై నిందలు వేస్తోందని ఆరోపించారు. తనను బలిపశువుగా మార్చడం పక్కనపెట్టి జనం ఆకాంక్షలు నెరవేర్చాలని ఆయన హితవు పలికారు. మరోవైపు వాంగుచుక్ అరెస్టును కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ ఖండించారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.