న్యూయార్క్: ఇరాన్ అణు కార్యక్రమంపై ఐక్యరాజ్యసమితి మళ్లీ ఆంక్షలు విధించింది. ఈమేరకు “సెప్టెంబర్ 27న రాత్రి 8 గంటలకు భద్రతా మండలి తీర్మానం ప్రవేశపెట్టింది. కాగా, ఇరాన్ చేపడుతున్న అణు కార్యక్రమం నేపథ్యంలో దానిపై ఆంక్షలు విధించాలని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు అంతకుముందు భద్రతా మండలిని కోరాయి. అణ్వాయుధాలు తయారు చేయకుండా ఇరాన్‌ను నిరోధించేందుకు ఉద్దేశించిన 2015 నాటి సంయుక్త సమగ్ర కార్యాచరణ ప్రణాళికపై (JCPOA) ఈ మూడు యూరోపియన్ దేశాలు సంతకాలు చేశాయి. ఒప్పందం మేరకు ఇచ్చిన హామీని ఇరాన్ ఉల్లంఘించిందని ఆ దేశాలు ఆరోపించాయి.
ఈ ఆంక్షల ప్రకారం.. ఇరాన్‌కు విదేశాల్లో ఉన్న ఆస్తులను స్తంభింపజేస్తారు. అలాగే ఆ దేశంతో ఆయుధ డీల్స్ నిలిపివేస్తారు. ఇరాన్‌కు సంబంధించిన బాలిస్టిక్ మిసైల్ కార్యక్రమంపై కూడా చర్యలు తీసుకోనున్నారు. నిజానికి ఈ ఆంక్షలు అక్టోబర్ 18న శాశ్వతంగా తొలగిపోవాల్సి ఉంది. అయితే గతంలో జరిగిన జాయింట్ కాంప్రెహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (JCPOA) ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ఆరోపణలు రావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ ఒప్పందం ప్రకారం.. ఇందులో సంతకం చేసిన ఏ దేశమైనా అవసరమైతే ఆంక్షలను తిరిగి విధించవచ్చు. ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాలు ఆగస్టు 28న ఇరాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ప్రకటించాయి. దీంతో 30 రోజుల కౌంట్‌డౌన్ ప్రారంభమై.. ఇప్పుడు ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
నెల రోజుల క్రితమే స్నాప్‌బ్యాక్‌ను ప్రయోగిస్తామంటూ ఫ్రాన్స్, జర్మనీ, యూకేలు హెచ్చరించాయి. అయినప్పటి కీ ఇరాన్ ఐఏఈఏ పరిశీలకులను అణు కేంద్రాల్లో తనిఖీలకు అనుమతించేందుకు అంగీకరించలేదు. శుద్ధి చేసిన యురేనియం నిల్వల గురించిన సవివర నివేదికను ఐఏఈఏకు పంపలేదు. దీంతో ఆంక్షలు అనివార్యమయ్యాయని పశ్చిమ దేశాలంటున్నాయి.
కాగా, ఐరాస ఆంక్షలు అమల్లోకి రావడంతో ఇరాన్ ప్రతీకార చర్యలపై తీవ్ర సమాలోచనలు చేస్తోంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్పీటీ) నుంచి వైదొలిగే ప్రతిపాదనను ఇరాన్ పార్లమెంట్ పరిశీలించే అవకాశాలున్నాయని ఎక్కువగా ఉన్నాయని స్పీకర్ మహ్మద్ బఘెర్ కలిబాస్ తెలిపారు. ఆంక్షలు విధించడం అన్యాయమని ఆయన అన్నారు. ఎన్పీటీ నుంచి వైదొలగడం ద్వారా అణు బాంబును తయారు చేసే అవకాశాలున్నాయన్న వార్తలను ఇరాన్ స్పీకర్ కొట్టిపాచేశారు.
అయితే, ఇరాన్‌కు దౌత్య మార్గాలు తెరిచే ఉన్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు. ఇందుకోసం ముందుగా ఇరాన్ తమతో నేరుగా చర్చలకు రావాలని ఆయన స్పష్టం చేశారు.