న్యూయార్క్: ఆస్కార్ అవార్డు గ్రహీత అమెరికా నటి జెన్నిఫర్ లారెన్స్ గాజాలో మానవతా సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేశారు. యునైటెడ్ స్టేట్స్ (యుఎస్)లో రాజకీయ నిజాయితీ లేకపోవడం గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల జరిగిన శాన్ సెబాస్టియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో తన కొత్త చిత్రం డై, మై లవ్‌ను ప్రమోట్ చేస్తున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ… గాజా హింసను చూసి”నేను భయపడ్డాను, అది ఎంతో బాధాకరం” అని లారెన్స్ విలేకరుల సమావేశంలో ఆమె అన్నారు.
గాజాలో కొనసాగుతున్న హింసతో సహా ప్రపంచ సంఘర్షణల ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుందనే ప్రశ్నకు సమాధానంగా లారెన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర పరిశీలకుల ప్రకారం…2023 అక్టోబర్ నుండి వేలసంఖ్యలో పాలస్తీనియన్లు మరణించారు. ఇంకా చాలా మంది గాయపడ్డారు.
ఇజ్రాయెల్ చలనచిత్ర సంస్థల సాంస్కృతిక బహిష్కరణలపై, వినోద పరిశ్రమలో జరుగుతున్న చర్చపై ఆమె మాట్లాడారు, జవాబుదారీతనం కళాకారులపై కాకుండా నిర్ణయాధికారులపై దృష్టి పెట్టాలని నొక్కి చెప్పారు. “మన వాక్ స్వేచ్ఛ, కళాత్మక వ్యక్తీకరణ ముప్పులో ఉంది” అని ఆమె అన్నారు.
మార్టిన్ స్కోర్సెస్ సహనిర్మాత, లిన్ రామ్సే దర్శకత్వం వహించిన డై, మై లవ్ చిత్రం ప్రదర్శనకు ముందు లారెన్స్ డోనోస్టియా లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఉత్సవంలో అందుకుంటారు. ఈ చిత్రంలో రాబర్ట్ ప్యాటిన్సన్, నిక్ నోల్టే, సిస్సీ స్పేస్క్, లకీత్ స్టాన్ఫీల్డ్ నటించారు. ఈ సినిమా నవంబర్ 7న విడుదల కానుంది.
కాగా, ఇజ్రాయెల్ గాజాలో జెనోసైడ్కు పాల్పడుతోంది. వైమానిదాడుల దెబ్బకు గాజా ఓ శిధిల నగరంగా మారింది. మౌలిక సదుపాయాలు పూర్తిగా నశించాయి. నిర్వాసితుల సంఖ్య పెరిగింది. అధిక సంఖ్యలో ప్రాణనష్టంతో గాజాలో మానవతా పరిస్థితి మరింత దిగజారుతోంది. అంతర్జాతీయ న్యాయస్థానంతో సహా అంతర్జాతీయ సంస్థలు ఆరోపించిన యుద్ధ నేరాలపై దర్యాప్తు చేస్తున్నాయి.