చెన్నై: టీవీకే పార్టీ చీఫ్ శనివారం కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 40కి పెరిగింది. 60 మందికి పైగా ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు, కనీసం ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి కె పళనిస్వామి, బిజెపికి చెందిన నైనార్ నాగేంద్రన్, కె అన్నామలై, విసికె చీఫ్ తోల్ తిరుమావళవన్, పిఎంకె అగ్ర నాయకుడు అన్బుమణి రామదాస్ ఆసుపత్రిని సందర్శించారు.
మరోవంక రజనీకాంత్, ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్ వంటి ప్రముఖులు మరణాలకు సంతాపం తెలిపారు. కాగా,
నలభైమందికిపైగా ప్రజలు మరణించడంతో టీవీకే చీఫ్ విజయ్ అరెస్టుకు అవకాశం ఉందా అనే ప్రశ్నకు సీఎం సమాధానమిస్తూ, ఏదైనా చర్య విచారణ ప్యానెల్ నివేదిక ఆధారంగా ఉంటుందని ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు. రాజకీయ ఉద్దేశ్యంతో తాను ఎటువంటి వ్యాఖ్య చేయడానికి ఇష్టపడనని నొక్కి చెప్పారు.
ఇదిలా ఉండగా, చెన్నైలోని విజయ్ ఇంటి ముందు తమిళ విద్యార్థుల సంఘం నిరసన ప్రదర్శన నిర్వహించింది.
మరోవంక ప్రధాని నరేంద్ర మోడీ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం సైతం మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, గాయపడిన వారికి రూ. లక్ష చొప్పున పరిహారం ప్రకటించగా, టీవీకే మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలు ప్రకటించింది.
తమిళనాడు కాంగ్రెస్ కమిటీ మృతుల కుటుంబాలకు రూ. 1 కోటి పరిహారమివ్వగా, మృతుల కుటుంబాలకు బీజేపీ లక్ష చొప్పున పరిహారం ప్రకటించింది.
ఇదిలా ఉండగా, తొక్కిసలాటలో గాయపడిన ఒక వ్యక్తి శనివారం జరిగిన ఘోర సంఘటనను పూర్తిగా విచారించి బాధ్యతను నిర్ణయించే వరకు తమిళనాడు డీజీపీ తదుపరి బహిరంగ సభలు నిర్వహించకుండా ఉండాలనే అభ్యర్థనతో హైకోర్టును ఆశ్రయించారు.
ఈ సంఘటనలో కుట్ర కోణంపై టీవీకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ, నిష్పాక్షిక దర్యాప్తు కోసం పార్టీ హైకోర్టు బెంచ్‌ను ఆశ్రయించిందని అన్నారు. మరణించిన, గాయపడిన వారి గురించి తాజా సమాచారం అందిస్తూ, ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని, మిగతా వారందరూ స్థిరంగా ఉన్నారని తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి పి. సెంథిల్ కుమార్ తెలిపారు.
కాగా, సరైన ఏర్పాట్లు చేయడంలో పోలీసులు, ప్రభుత్వం విఫలమయ్యారని ఎడప్పాడి పళనిస్వామి ఆరోపించారు.
నటుడిని చూడటానికి ఊహించిన దానికంటే చాలా ఎక్కువ సంఖ్యలో ప్రజలు గుమిగూడడంతో పరిస్థితి అదుపు తప్పిందని పోలీసులు పేర్కొన్నారు.
అలాగే, నటుడు-రాజకీయ నాయకుడు వేదికకు ఆలస్యంగా రావడం వల్ల జనం ఎగబడ్డారు. దీంతో పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాట జరిగింది. ర్యాలీకి దాదాపు 500 మంది పోలీసులను మోహరించామని, సరైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ADGP (లా అండ్ ఆర్డర్) డేవిడ్సన్ అన్నారు. ర్యాలీ సమయంలో రాళ్ల దాడి జరిగిందనే వాదనలను ఆయన ఖండించారు.
విజయ్ ప్రచార వాహనం కరూర్‌లో నిర్దేశించిన ప్రదేశం నుండి 50 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు, వాహనాన్ని ఆపి, అక్కడి నుండే సభను ఉద్దేశించి ప్రసంగించాలని DSP స్థాయి అధికారి ఆయనకు సూచించారు. కానీ వారు తమ సహకారాన్ని అందించలేదు. నిర్దేశించిన ప్రదేశానికి వెళ్లాలని పట్టుబట్టారు.
ర్యాలీకి వేదిక కేటాయింపు, మోహరించిన పోలీసు సిబ్బంది సంఖ్యపై బిజెపి నాయకుడు అన్నామలై రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. వారాంతపు పర్యటనలు ఎక్కువ మందిని ఆకర్షిస్తాయని, అందువల్ల విజయ్ వారాంతపు పర్యటనలను వదులుకోవాలని ఆయన కోరారు.జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. CBI విచారణకు ఆదేశించాలని ఆయన కోరారు.
కరూర్ జిల్లా కలెక్టర్ M తంగవేల్ మాట్లాడుతూ… బాధితులకు వెంటనే సేవలందించేందుకు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో అనేక కంట్రోల్ రూమ్‌లను ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. ర్యాలీ జరిగినప్పుడు విద్యుత్ సరఫరా ఆపలేదని తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ సి రాజలక్ష్మి ఖండించారు.
కరూర్ సంఘటన గురించి రాహుల్ గాంధీ తనతో ఫోన్‌లో మాట్లాడారని సిఎం స్టాలిన్ అన్నారు. “నా ప్రియమైన సోదరుడు రాహుల్‌గాంధీ, ఫోన్‌లో నన్ను సంప్రదించినందుకు, కరూర్‌లో జరిగిన విషాద సంఘటనపై హృదయపూర్వక ఆందోళనను తెలియజేసినందుకు, చికిత్స పొందుతున్న వారి విలువైన ప్రాణాలను కాపాడటానికి తీసుకున్న చర్యల గురించి విచారించినందుకు ధన్యవాదాలు” అని సీఎం స్టాలిన్ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. కాగా, రాహుల్ గాంధీ విజయ్‌తో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది.