వాషింగ్టన్ డీసీ: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఖతార్ ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ బిన్ జాసిమ్ అల్ థానీకి క్షమాపణలు చెప్పారు. సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన త్రిముఖ సంభాషణలో దోహాలో ఇజ్రాయెల్ దాడికి సారీ చెప్పారని వైట్ హౌస్ తెలిపింది. ఈ దాడులు ఖతార్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించాయని నెతన్యాహు అంగీకరించారు. వైమానిక దాడుల్లో చనిపోయిన ఖతార్ భద్రతా సిబ్బందిపై కూడా ఆయన విచారం వ్యక్తం చేసారని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి.
గాజాలో యుద్ధాన్ని ముగించేందుకు సంబంధించిన ఒప్పందంపై చర్చించేందుకు నెతన్యాహును ట్రంప్ వైట్‌హౌ్‌సకు ఆహ్వానించారు. ఈ సందర్భంగానే వారిద్దరూ ఖతార్ ప్రధానితో మాట్లాడినట్టు తెలుస్తోంది.
కాగా, దోహాలో ట్రంప్ శాంతి ప్రతిపాదనపై చర్చించేందుకు సమావేశమైన హమాస్ రాజకీయ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఈ దాడులు చేసింది. ఖతార్ అమెరికాకు మిత్రదేశం. మధ్యప్రాచ్యంలో అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం దోహాలో ఉంది. అందువల్ల ఈ దాడి అంతర్జాతీయంగా కలకలం సృష్టించింది. ఈ దాడి ట్రంప్ విశ్వసనీయతపై అనుమానాలు పెంచింది.