హైదరాబాద్: భారీగా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ప్రైవేట్ కాలేజీలు మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిర్దేశించిన గడువులోగా రూ.600 కోట్ల బకాయిలను చెల్లించని దసరా తర్వాత కాలేజీలు తెరిచేది లేదని స్పష్టం చేశాయి. అంతేకాదు ఈ నెల 6 నుంచి తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమాఖ్య నిరవధిక బంద్‌కు పిలుపు ఇచ్చింది.
కాగా, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కాలేజీలు గత నెల 15న బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం, యాజమాన్యాలతో చర్చలు జరిపింది. దసరాకు ముందు రూ.600 కోట్లు, దీపావళి తర్వాత మరో రూ.600 కోట్లు విడుదల చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ప్రభుత్వ హామీతో యాజమాన్యాలు తమ ఆందోళనను విరమించుకున్నాయి.
అయితే, ప్రభుత్వం హామీ ఇచ్చి రెండు వారాలు గడిచిపోయినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంపై ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాతో కాలేజీల ప్రతినిధులు సమావేశమయ్యారు. అయినా వారికి సంతృప్తి దక్కలేదు.
ఇదిలా ఉండగా ప్రభుత్వ వైఖరితో తీవ్ర అసంతృప్తికి గురైన యాజమాన్యాలు మళ్లీ ఆందోళన బాట పట్టాయి. దీనిపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు ‘ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్’ ప్రతినిధులు నేడు హైదరాబాద్‌లో అత్యవసరంగా సమావేశం అయ్యారు.