చింద్వారా: మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో “విషపూరిత” దగ్గు సిరప్ వాడిన కారణంగా 14 మంది పిల్లలు మరణించిన ఘటనపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు పిల్లల మరణాలకు సంబంధించి నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై చింద్వారాకు చెందిన డాక్టర్ ప్రవీణ్ సోని అరెస్టు చేయగా, కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ తయారీ సంస్థపై కేసు నమోదు చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు.
ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించిన ఒక్కొక్కరికి రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియాను బాధితుల కుటుంబాల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్లు చింద్వారా అదనపు కలెక్టర్ ధీరేంద్ర సింగ్ తెలిపారు.
నాగ్‌పూర్‌లో ఎనిమిది మంది పిల్లలు, నలుగురు ప్రభుత్వ ఆసుపత్రిలో, ఒకరు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో, ముగ్గురు ప్రైవేట్ సౌకర్యాలలో చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పారు.
మరోవంక మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో ఇద్దరు పిల్లలు కోల్డ్‌రిఫ్ దగ్గు సిరప్ తీసుకున్న తర్వాత మరణించారని ఆరోగ్య అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా డాక్టర్ సోని అరెస్టుతో కలత చెందిన ఆయన సహచరులు నేటినుండి పని సమ్మె చేస్తామని బెదిరించారు.
సంక్షోభాన్ని నిర్వహించడంలో “బిజెపి ప్రభుత్వ వైఫల్యాన్ని” హైలైట్ చేయడానికి, పిల్లల కుటుంబాలకు మరింత ఆర్థిక ఉపశమనం కోరుతూ ప్రతిపక్ష కాంగ్రెస్ సోమవారం నుండి నిరసనను ప్రకటించింది.
కాంచీపురంలోని శ్రీసన్ ఫార్మాస్యూటికల్ తయారు చేసిన కోల్డ్‌రిఫ్ దగ్గు సిరప్ అమ్మకాలను మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది, ఔషధ నమూనాలలో అత్యంత విషపూరితమైన పదార్థం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మరణించిన పిల్లలలో 11 మంది పరాసియా సబ్-డివిజన్‌కు చెందినవారు, ఇద్దరు చింద్వారా నగరానికి చెందినవారు ఒకరు చౌరాయ్ తహసీల్‌కు చెందినవారు. ఈ మేరకు పరాసియా సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ జితేంద్ర సింగ్ జాట్ నేతృత్వంలో 12 మంది సభ్యులతో కూడిన సిట్ ఏర్పాటు చేసారని, వారు తమిళనాడులోని ఫార్మా కంపెనీని సందర్శిస్తారని అదనపు కలెక్టర్ సింగ్ తెలిపారు.
మరోవంక బాధితురాలు రెండేళ్ల యోగితా థాక్రే మృతదేహాన్ని ఆమె కుటుంబం కోరిన మేరకు పోస్ట్‌మార్టం కోసం బయటకు తీశామని సింగ్ చెప్పారు.ఇప్పటివరకు 1,102 మంది పిల్లల నమూనాలను సేకరించామని ఆయన చెప్పారు. మొత్తం 5,657 పరీక్షలు నిర్వహించగా, వాటిలో 4,868 మంది ఫలితాలు వచ్చాయి.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం యాదవ్ చెప్పిన ఒక రోజు తర్వాత, ప్రభుత్వం డాక్టర్ సోనిని సర్వీసు నుండి సస్పెండ్ చేసింది. కాగా, డాక్టర్ సోనిని విడుదల చేయకపోతే, నేటి నుండి వైద్యులు నిరవధిక సమ్మె ప్రారంభిస్తారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చింద్వారా యూనిట్ అధ్యక్షురాలు కల్పనా శుక్లా అన్నారు.
ప్రభుత్వ “ఉదాసీనత”, పెరుగుతున్న పిల్లల మరణాలపై చర్య తీసుకోవడంలో జాప్యం, బాధితుల కుటుంబాలకు “సరిపోని” పరిహారం చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ నేడు జిల్లా కేంద్రంలోని ఫవారా చౌక్ వద్ద తమ కార్యకర్తలు ధర్నా నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ఒక ప్రకటనలో తెలిపింది.