న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై సుప్రీంకోర్టులో ఒక న్యాయవాది షూ విసిరేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం సృష్టించింది. ఆ వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కోర్టు గదిలో జరిగిన దిగ్భ్రాంతికరమైన పరిణామంతో నిర్ఘాంతపోయిన చీఫ్ జస్టిస్ గవాయ్, “ఇలాంటి వాటి వల్ల నేనేమీ బెదరను” అని చెబుతూ విచారణ కొనసాగించారు.
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం…ఈ క్రమంలో సనాతన ధర్మాన్ని సీజేఐ అవమానించాడని సదరు న్యాయవాది నినాదాలు చేశాడు.
కాగా, ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీనియర్ న్యాయనిపుణురాలు ఇందిరా జైసింగ్ అన్నారు. “ఆ న్యాయవాది పేరును వెల్లడించాలి. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇది భారత సుప్రీంకోర్టుపై జరిగిన స్పష్టమైన కుల దాడిగా కనిపిస్తోంది. సైద్ధాంతిక దాడులను కోర్టు సహించదని సుప్రీంకోర్టులోని న్యాయమూర్తులు ఐక్యంగా ఒక పత్రికా ప్రకటన ద్వారా ఖండించాల్సిన అవసరం ఉంది. “కోర్టు గౌరవానికి తగినట్లుగా, CJI గవాయ్ ఎటువంటి స్పష్టమైన ఆటంకాలు లేకుండా న్యాయపరమైన పని చేసారు” అని ఆమె X లో పేర్కొన్నారు.
అయితే కొన్ని రోజుల క్రితం సీజేఐ గవాయ్.. ఓ కేసులో చేసిన వ్యాఖ్యల వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఖజురహోలోని ఏడు అడుగల విష్ణు విగ్రహాన్ని పునర్ ప్రతిష్టించాలని దాఖలు చేసిన కేసులో సీజేఐ గవాయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ కేసును ఆయన డిస్మిస్ చేస్తూ వెళ్లి ఆ దేవుడినే అడుక్కోవాలన్న కామెంట్ చేశారు. విష్ణువుకు వీరభక్తుడిని అని చెప్పుకుంటున్నావు కాదా, వెళ్లి ఆ దేవుడినే ప్రార్థించుకో, అదో ఆర్కియాలజీ సైట్ అని, దానికి ఏఎస్ఐ పర్మిషన్ అవసరం ఉంటుందని ఆ కేసులో సీజేఐ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్య విమర్శలకు దారితీసింది, విష్ణు భక్తుల విశ్వాసం పట్ల ప్రధాన న్యాయమూర్తి అగౌరవంగా ఉన్నారని చాలామంది అన్నారు. దీనికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, సోషల్ మీడియాలో విషయాలు తరచుగా ఊహించని విధంగా జరుగుతాయని అన్నారు. “మనకు న్యూటన్ నియమం తెలుసు – ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది, కానీ ఇప్పుడు ప్రతి చర్యకు అసమానమైన సోషల్ మీడియా ప్రతిచర్య ఉంటుంది” అని ఆయన అన్నారు.
కోర్టు గదిలో ఉన్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కూడా దీనికి ఏకీభవించారు. “మనం ప్రతిరోజూ దీనితో బాధపడుతున్నాము. సోషల్ మీడియా ఒక వికృత గుర్రం, దానిని మచ్చిక చేసుకోవడానికి మార్గం లేదు అని ఆయన వ్యాఖ్యానించారు!”