-ముహమ్మద్ ముజాహిద్, 9640622076
ఒక చిన్న బాలుడు… గాజాలోని ఒక శిధిలమైన ఇంటి మూలలో కూర్చున్నాడు. చుట్టూ గుంతలు, ధూళి, నిశ్శబ్దం.అతని చెయ్యిలో పగిలిన ప్లేట్, అందులో ఒకే ఒక్క రొట్టె ముక్క. తల్లి అతన్ని చూసి నెమ్మదిగా నవ్వింది — కానీ ఆ నవ్వు వెనుక దాచిన ఆకలి స్పష్టంగా కనిపించింది. “తిను బిడ్డా,” అని ఆమె అన్నది. “నాకు ఆకలి లేదు…” అని అబద్ధం చెప్పింది. ఇది ఒక్క గాజా కథ కాదు — ఇది ప్రపంచం అంతా ఆకలితో ఉన్న ప్రతి తల్లి, ప్రతి పిల్లవాడు, ప్రతి మనిషి కథ. ఆకలి — మానవతను తినేస్తున్న నిశ్శబ్ద రాక్షసి. 2024లో, 53 దేశాల్లో 295 మిలియన్ల మంది ప్రజలు ఆకలితో అలమటించారని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక చెప్పిన నగ్న సత్యం.
ఎక్కడో ఒక వైపు బుల్లెట్లు, బాంబులు; ఇంకో వైపు రొట్టె కోసం పోరాటం. ఈ యుద్ధాలు భూభాగం కోసం కాదు, ఆహారం కోసం. సూడాన్‌లో భోజనశిబిరం ఎదుట పొడవైన క్యూలు, మాలిలో పిల్లలు మట్టి కేక్‌లను తింటున్నారు, హైతీలో తల్లులు రాళ్లను మరిగించి పిల్లలకు “ఏదో వంట ఉంది” అన్న భ్రమ కలిగిస్తున్నారు. మరి అదే సమయంలో, ప్రపంచంలోని ధనిక దేశాలు వందల కోట్ల డాలర్లతో ఆయుధాలు తయారు చేస్తున్నాయి.ఆకలిని కాదు, అహంకారాన్ని పెంచిన యుగం ఇది. వాతావరణం మారుతోంది, కానీ మన మనసు మారడం లేదు.భూమి వేడెక్కుతోంది, వర్షాలు ద్రోహం చేస్తున్నాయి.
ఎల్-నీనో ప్రభావం, కరువు, వరదలు —రైతు పంటను కాదు, ప్రాణాన్ని కోల్పోతున్నాడు.కానీ వాతావరణం మారడం కంటే పెద్ద సమస్య —మనిషి వైఖరి మారకపోవడం.ప్రకృతిని దోచుకుని, పంటలపై లాభాల పంట వేసి, రైతును అప్పుల్లో ముంచి, చివరికి అదే రైతు చేతికి ఉరితాడు ఇవ్వడం…ఇది వాతావరణ మార్పు కాదు, మన మానసిక క్షీణత.
భారత కథ — బియ్యం ఎగుమతి, ఆకలి దిగుమతి భారతదేశం ప్రపంచానికి బియ్యం పంపుతోంది, కానీ అదే దేశంలో 74% మంది పౌష్ఠికాహారం కొనలేరు. ఇది సాంకేతిక విప్లవం కాదు, ఆకలి విప్లవం.ఒకవైపు రైతు తన భూమి అమ్మి అప్పులు తీర్చుకుంటున్నాడు, మరోవైపు నగరాల్లో ఆహారం వృధా అవుతోంది. పిల్లలలో 36% మందికి వృద్ధి తగ్గింది, 67% మందికి రక్తహీనత ఉంది —అయినా మనం గర్వంగా “వికసిస్తున్న భారత్” అంటున్నాం!వృద్ధి అంటే గణాంకం కాదు, అది ఆహారం. భారతదేశం నిజంగా ఎదిగిన రోజు — పేదవాడు ఆకలితో నిద్రపోని రోజు.
ఒక తల్లి కథ ఢిల్లీకి సమీపంలో ఒక చిన్న బస్తీలో, రాత్రి 10 గంటలు అయ్యింది. తల్లి ముగ్గురు పిల్లలకు భోజనం పెట్టి, కూర్చుంది. పిల్లలు తిన్నారు, కానీ చివర్లో తల్లి తినలేదు.“అమ్మా, నువ్వు ఎందుకు తినట్లేదు?” అని చిన్న కుమార్తె అడిగింది. తల్లి నవ్వింది — “నాకు ఆకలి లేదు బిడ్డా,” అంది. కానీ ఆమె కళ్లలో కనిపించిన కన్నీరు, ఆమె కడుపులోని ఆకలి కంటే పెద్దదై ఉంది. అలాంటి తల్లులు లక్షల్లో ఉన్నారు — కానీ వారి కథలు రిపోర్టుల్లో కనిపించవు. మనం ఆకలిని మరిచిపోవచ్చు — కానీ ఆకలి మనలను మర్చిపోదు.