సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. బిలాస్‌పూర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఓ టూరిస్టు బస్సు ధ్వంసమై ఏకంగా 18 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో డ్రైవర్,కండక్టర్ కూడా ఉన్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీస్తున్నారు. విరిగిపడ్డ కొండచరియలు బస్సును పూర్తిగా కప్పేశాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాగా, బాలాఘాట్ ప్రాంతంలో వర్షం కురుస్తూనే ఉంది.
హర్యానాలోని రోహ్‌తక్ నుంచి హిమాచల్‌ప్రదేశ్‌లోని ఘుమర్విన్‌కు ఈ ప్రయివేటు టూరిస్టు బస్సు వెళుతోంది. ఝండూతా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బలూఘాట్ ప్రాంతానికి మంగళవారం రాత్రి చేరుకోగానే కొండచరియలు విరిగి బస్సుపై పడ్డాయి. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన బృందాలు శిథిలాల్లో చిక్కుకున్న పలువురిని ప్రాణాలతో బయటకు తీశాయి.
కాగా, ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోడీ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొరికీ రూ 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారాన్ని ప్రధాని ప్రకటించారు.
కేంద్ర మంత్రులు అమిత్‌షా, జెపి నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధాకరం, దురదృష్టకరమని తెలిపారు.