వనపర్తి : ఎంపీటీసీ-జెడ్పీటీసీ ఎన్నికల మొదటి దశకు నామినేషన్ల స్వీకరణపై సంబంధిత రిటర్నింగ్ అధికారులతో వనపర్తి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆదర్శ్ సురభ్ మాట్లాడుతూ.. గురువారం ఉదయం 10 గంటలలోపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల మొదటి దశ ఎన్నికల నోటిఫికేషన్‌ను ప్రచురించాలని ఆర్‌ఓలను ఆదేశించారు. నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలని ఆయన సూచించారు. నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్థితో పాటు ఇద్దరు కంటే ఎక్కువ మందిని రిటర్నింగ్ అధికారుల గదిలోకి అనుమతించరాదని ఆయన సూచించారు.
నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చిన అభ్యర్థులు నిర్దేశించిన పత్రాలను తీసుకురాకపోతే, వారి నామినేషన్లను తిరస్కరించడానికి బదులుగా వారికి గడువుతో కూడిన నోటీసు ఇవ్వాలని సూచించారు. ప్రతి రిటర్నింగ్ అధికారికి వారి ప్రాదేశిక నియోజకవర్గం ఓటర్ల జాబితా తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను జాగ్రత్తగా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు.
అంతేకాదు నామినేషన్ కేంద్రాల వద్ద రిటర్నింగ్ అధికారులు ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించాలని, నామినేషన్ ప్రక్రియ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, రిటర్నింగ్ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.