24.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

అంతరిక్షంలోకి తొలి ప్రైవేట్ రాకెట్…. ముహూర్తం ఖరారు చేసిన ‘స్కైరూట్ ఏరోస్పేస్’!

హైదరాబాద్‌: భారత అంతరిక్షరంగంలో నూతన అధ్యాయం మొదలు కాబోతోంది. పాశ్చాత్య దేశాల తరహాలో మనదేశంలోనూ అంతరిక్షరంగంలో  ప్రైవేటు సంస్థలు ప్రవేశిస్తున్నాయి. నగరానికి చెందిన అంతరిక్ష పరిశోధనల సంస్థ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సంస్థ తమ తొలి రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపేందుకు ముహూర్తం ఖరారు చేసింది. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన రాకెట్ – విక్రమ్-ఎస్ – నవంబర్ 12 – 16 మధ్య ప్రయోగానికి సిద్ధంగా ఉందని స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రకటించింది. ఈ మిషన్‌తో..  అంతరిక్ష రంగంలో నూతన శకానికి నాంది పలికింది. అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించిన భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష సంస్థగా స్కైరూట్ ఏరోస్పేస్ అవతరించనున్నది.

స్కైరూట్ ఏరోస్పేస్ యొక్క తొలి మిషన్‌కు ‘ప్రారంభ్’ (స్టార్) అని పేరు పెట్టారు. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ లాంచ్‌ప్యాడ్ నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించనున్నారు. నవంబర్ 12 నుంచి నవంబర్ 16 మధ్య లాంచ్ విండోను అధికారులు నోటిఫై చేశారని,వాతావరణ పరిస్థితులను బట్టి  తేదీని నిర్ధారిస్తామని స్కైరూట్ ఏరోస్పేస్ CEO , సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన తెలిపారు.

‘మా తొలి అంత‌రిక్ష మిష‌న్ ప్రారంభను మొద‌లుపెట్ట‌బోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు, మ‌న‌దేశంలో ప్రైవేట్ స్పేస్‌ కంపెనీ రాకెట్‌ని ప్ర‌యోగించ‌డం ఇదే మొద‌టిసారి. న‌వంబ‌ర్ 12, 16 తేదీల్లో రాకెట్‌ని లాంఛ్ చేయ‌నున్నాం. మా మిష‌న్ లోగోని ఆవిష్క‌రించినందుకు ఇస్రో ఛైర్మ‌న్‌కు ధ‌న్య‌వాదాలు. మాకు అన్నివిధాలా స‌హ‌క‌రించినందుకు ఇండియ‌న్ నేష‌న‌ల్ స్పేస్ ప్ర‌మోష‌న్ అండ్ ఆథ‌రైజేష‌న్ సెంట‌ర్‌కి ధ‌న్య‌వాదాలు’ అని స్కైరూట్ ఏరోస్పేస్ ట్వీట్ చేసింది.

“విక్రమ్-ఎస్ రాకెట్ సింగిల్ స్టేజ్ సబ్ ఆర్బిటాల్ లాంచ్ వెహికల్. ఇది మూడు కస్టమర్ పేలోడ్స్‌ను నింగిలోకి తీసుకెళుతుంది. ఈ మిషన్‌తో తరువాతి విక్రమ్ శ్రేణి వాహక నౌకలకు సంబంధించి సాంకేతికతలను పరీక్షించడానికి ఇది ఎంతో దోహదం చేస్తుందని అని” స్కైరూట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నాగ భరత్ దాక పేర్కొన్నారు. భారత అంతరిక్ష పితామహుడు, ప్రఖ్యాత శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్‌కి నివాళిగా స్కైరూట్ సంస్థ తమ వాహక నౌకలకు విక్రమ్ పేరు పెట్టింది.

హైదరాబాద్‌లో ఉన్న స్కైరూట్ సంస్థ… రాకెట్ ప్రొపల్షన్ స్టేజ్‌ను డిజైన్ చేసి, నిర్మించి, పరీక్షించిన మొదటి ప్రైవేట్ భారతీయ కంపెనీ, ఈ సంవత్సరం ప్రారంభంలో రాకెట్ యొక్క మూడవ దశను పూర్తి-నిడివి పరీక్షను పూర్తి చేసింది. భారత రాకెట్ శాస్త్రవేత్త మరియు మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం పేరు మీద మూడవ దశకు కలాం-100 అని పేరు పెట్టారు,

ఇక విక్రమ్ 480 కిలోగ్రాముల వరకు తక్కువ వంపు ఉన్న కక్ష్యలకు మోసుకెళ్లేలా రూపొందించబడింది. దీనిని 24 గంటల్లో ఏ ప్రయోగ కేంద్రం నుండి అయినా అసెంబుల్ చేసి లాంచ్ చేయవచ్చు.

స్కైరూట్ ఏరోస్పేస్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో సింగపూర్ ప్రధాన కార్యాలయం కలిగిన దీర్ఘ-కాల పెట్టుబడి సంస్థ GIC నేతృత్వంలో సిరీస్-బి ఫైనాన్సింగ్ రౌండ్ ద్వారా $51 మిలియన్లు అంటే రూ. 403 కోట్లను విజయవంతంగా సేకరించింది. ఇది భారతదేశ అంతరిక్ష సాంకేతిక రంగంలో ఇప్పటివరకు సేకరించిన అతిపెద్ద మొత్తంగా అవతరించింది.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles