24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్యం… టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి విమర్శ!

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న హామీలు, కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన ఇతర హామీలను వెంటనే నెరవేర్చాలని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీని డిమాండ్ చేశారు. ప్రధాని రాష్ట్ర పర్యటన సందర్భంగా రేవంత్‌రెడ్డి శనివారం ఆయనకు బహిరంగ లేఖ రాశారు.

‘పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ఎనిమిదేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. కాజీపేట రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐఐటీ, ఐఐఎం, రామగుండంలో 4000 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంటు ఏర్పాటు, గిరిజనులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు, ఐటీఐఆర్, జవహర్‌ నవోదయ, సైనిక్‌ స్కూల్స్‌ ఏర్పాటు, డిఫెన్స్‌ కారిడార్, చేనేతపై జీఎస్టీ ఎత్తివేత వంటి అంశాల్లో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది’ అని పేర్కొన్నారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా, పసుపు బోర్డు ఏర్పాటు, డిఫెన్స్‌ కారిడార్‌ లాంటి విషయాల్లో కూడా తెలంగాణకు అన్యాయమే జరిగిందన్నారు. సీఎం కేసీఆర్‌ వైఖరికి బీజేపీ రాష్ట్ర శాఖలోని కొందరు నాయకులు సహకరించే పరిస్థితి ఉందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు  ఎదుర్కొంటున్న సమస్యలపై వెంటనే కార్యాచరణ ప్రకటించాలని, లేదంటే వచ్చే శీతాకాల సమావేశాల్లో తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందని ప్రధానికి రాసిన లేఖలో రేవంత్‌ స్పష్టంచేశారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles