30.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

యాదాద్రి పవర్ ప్లాంట్ 2023 డిసెంబర్ నాటికి సిద్ధం… సీఎం కేసీఆర్!

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆలోచనలో రూపుదిద్దుకుంటున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి అల్ర్టా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్  సిద్ధమవుతోంది. ఒక్కోటి 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లు 2023 డిసెంబర్‌ నాటికి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన మూడు యూనిట్లు జూన్ 2024 నాటికి పూర్తవుతాయి.

ఈ ప‌వ‌ర్ ప్లాంట్ ప‌నుల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏరియ‌ల్ వ్యూ ద్వారా ప‌రిశీలించారు. విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, ఆ శాఖ ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా ప‌నుల పురోగ‌తిని ప‌రిశీలించారు. ఫ‌స్ట్ స్టేజ్ యూనిట్ 2లో బాయిల‌ర్ నిర్మాణంలో 82 మీటర్ల ఎత్తులోని 12వ ఫ్లోర్‌లో జ‌రుగుతున్న ప‌నుల‌ను సీఎం నిశితంగా ప‌రిశీలించారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న యాదాద్రి యూఎంపీపీ నిర్మాణం పూర్తయితే తెలంగాణకే కాదు యావత్ దేశానికే గర్వకారణంగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రైతులు, ప్రజల సంక్షేమం కోసం ప్రయివేటు, కార్పొరేట్ శక్తుల ఒత్తిడికి తలొగ్గకుండా ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలో ఈ ప్రాజెక్టును చేపట్టామని ముఖ్యమంత్రి అన్నారు.

ప్రత్యేక హెలికాప్టర్‌లో దామరచర్ల చేరుకున్న సీఎం కేసీఆర్ విద్యుత్‌ కేంద్రంలో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అనంతరం ఫ‌స్ట్ స్టేజ్ యూనిట్ 2లో బాయిల‌ర్ నిర్మాణంలో 82 మీటర్ల ఎత్తులోని 12వ ఫ్లోర్‌కు చేరుకుని  ప్లాంట్ నిర్మాణం జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకన్నారు.  పవర్ ప్లాంట్ గురించి అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులను పరిశీలించారు.

చంద్రశేఖర్ రావు తన పర్యటనలో పవర్ ప్లాంట్ యొక్క ఫేజ్ -1, ఫేజ్ -2 బాయిలర్లతో సహా వివిధ భాగాల పురోగతిని సమీక్షించారు. షెడ్యూల్ ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు పనులను వేగవంతం చేయాలని టీఎస్ జెన్‌కో, టీఎస్ ట్రాన్స్‌కో, బీహెచ్‌ఈఎల్ అధికారులను కోరారు. ప్రాజెక్టు స్థలంలో ఏర్పాటు చేసిన పవర్‌ ప్లాంట్‌ ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.

ప్లాంట్ ఆపరేషన్ కు కనీసం 30 రోజులకు అవసరమైన బొగ్గు నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. కీలకమైన విద్యుత్ ప్రాజెక్ట్ విషయంలో బొగ్గు నిల్వలు సహా ఇతర ఆపరేషన్ విషయంలో అధికారులు ముందుచూపుతో వ్యవహరించి తగు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. యాదాద్రి ప్లాంట్ నుండి హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాలకు విద్యుత్ కనెక్టివిటీ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. పవర్ ప్లాంట్‌కు ప్రతిరోజు బొగ్గు, నీరు, ఎంత అవసరం ఉంటుంది దానికి సంబందిచిన బొగ్గు, నీటి సరఫరా గురించి ఆరా తీశారు.

పవర్ ప్లాంట్ సిబ్బందికి ప్రతిపాదిత టౌన్‌షిప్‌కు తాగునీటితో పాటు పవర్ ప్లాంట్ అవసరాలను తీర్చడానికి కృష్ణా నది నీటిని సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను కోరారు. కృష్ణపట్నం ఓడరేవు, అద్దంకి హైవేపై దామరచెర్ల వద్ద పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల ఉపాధి కల్పించే ఉద్దేశంతో పవర్ ప్లాంటుకు దామరచర్ల ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు.

పవర్ ప్లాంట్‌లో పనిచేసే సుమారు పదివేల మంది సిబ్బందికి ఉపయోగపడేలా అద్భుతమైన టౌన్ షిప్ నిర్మాణం జరగాలని సీఎం ఆదేశించారు.టౌన్‌షిప్ నిర్మాణం కోసం అదనంగా 100 ఎకరాల స్థలాన్ని సేకరించాలని చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో సమీపంలో అభివృద్ధి కోసం సోలార్ పవర్ ప్లాంట్ కూడా ప్రతిపాదించబడినందున, మొత్తం సిబ్బందికి తగిన సంఖ్యలో క్వార్టర్లు ఉండేలా చూడాలని ఆయన కోరారు. సూపర్ మార్కెట్, కమర్షియల్ కాంప్లెక్స్, క్లబ్ హౌస్, హాస్పిటల్, స్కూల్, ఆడిటోరియం, మల్టీప్లెక్స్ థియేటర్‌తో పాటు దాదాపు 50 ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ప్రైవేట్‌ సిబ్బందికి ప్రత్యేక క్వార్టర్లు నిర్మించనున్నారు.

అలాగే దామరచర్ల హైవే నుంచి వీర్లపాలెం వద్ద పవర్ ప్లాంట్ వరకు 7 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల సీసీ రోడ్లను వెంటనే మంజూరు చేయాలని కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. రైల్వే క్రాసింగ్‌ వద్ద రోడ్డు ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌ఓబి) నిర్మాణంతోపాటు దామరచర్ల రైల్వేస్టేషన్‌ విస్తరణ పనులకు రైల్వేశాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులను కోరారు.

స్థానిక సమస్యలను పరిష్కరించండి
యాదాద్రి యూఎంపీపీ, నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు సేకరించిన రైతులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

ప్రజాప్రతినిధుల సమన్వయంతో స్థానికులకు సంబంధించిన సమస్యలతోపాటు ఈ సమస్యలపై కూడా దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, నల్గొండ జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డిని కోరారు.

మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు జి జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీలు జె సంతోష్‌కుమార్‌, బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు , సిఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles