న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువా కాదా అనే అంశంపై గందరగోళం నెలకొన్న కొన్ని వారాల తర్వాత, అది కేవలం “భారతీయ పౌరులు విదేశాలకు వెళ్లడానికి జారీ చేసే ఒక ప్రయాణ పత్రం మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈమేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఒక నిర్దిష్ట ప్రక్రియ ద్వారా తగిన “పరిశీలన” జరిపిన తర్వాతే పాస్‌పోర్ట్ జారీ చేస్తున్నామని తెలిపారు. “పాస్పోర్ట్స్ చట్టం-1967 ప్రకారం, భారతీయ పౌరులు విదేశాలకు వెళ్లేందుకు వీలుగా భారత ప్రభుత్వం జారీ చేసే పత్రమే భారతీయ పాస్‌పోర్ట్ అని ఆయన స్పష్టం చేశారు.
“ఇది ఒక నిర్దిష్ట ప్రక్రియలో భాగంగా తగిన పరిశీలన తర్వాత పాస్‌పోర్ట్ జారీ అవుతుంది. భారతీయ పౌరులకు లేదా ఇతర వ్యక్తులకు పాస్‌పోర్ట్‌ల జారీ అనేది పాస్పోర్ట్స్ చట్టం, 1967, పాస్పోర్ట్స్ నిబంధనలు-1980 ద్వారా నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం, ఎనిమిది శాతం కంటే తక్కువ మంది భారతీయుల వద్దే పాస్‌పోర్ట్ ఉందని జైస్వాల్ తెలిపారు.
గత నెల జూన్ 24న ‘పాస్‌పోర్ట్ సేవా దివస్’ సందర్భంగా జరిగిన సమావేశంలో, భారతీయ పాస్‌పోర్ట్ అనేది ఖచ్చితంగా ఒక ‘ప్రయాణ పత్రం’ మాత్రమేనని, దానిని పౌరసత్వానికి రుజువుగా పరిగణించకూడదని MEA స్పష్టంగా పేర్కొంది. అనేక రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో పాస్‌పోర్ట్‌ను పౌరసత్వ రుజువుగా ఉపయోగించవచ్చా అనే ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
భారతీయ పౌరులకు పాస్‌పోర్ట్‌లు జారీ చేసినప్పటికీ, ఆ చిన్న పుస్తకం ప్రధాన ఉద్దేశ్యం అంతర్జాతీయ ప్రయాణాన్ని సులభతరం చేయడం, విదేశాలలో గుర్తింపును నిర్ధారించడం అని అధికారులు నొక్కి చెప్పారు.
కాగా, పాస్పోర్ట్స్ చట్టం 1967 ప్రకారం… పౌరులు కాని వారికి కూడా పాస్‌పోర్ట్ జారీ చేయవచ్చు. కేవలం పాస్‌పోర్ట్ కలిగి ఉండటాన్ని పౌరసత్వానికి ‘ఖచ్చితమైన’ లేదా ‘అంతిమ’ రుజువుగా పరిగణించలేమని బాంబే హైకోర్టు 2013 నాటి తీర్పులో పేర్కొంది.
ఒక వ్యక్తి నివాస స్థితికి సంబంధించిన పోలీసు ధృవీకరణతో సహా సమగ్ర నేపథ్య పరిశీలనల తర్వాతే పాస్‌పోర్ట్ జారీ అవుతుందని చాలామంది ఎత్తిచూపడంతో, ఈ వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారితీశాయి.
విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ వీడియో లింక్

