Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ ముఠాపై’ఈగిల్ ఫోర్స్’ ఉక్కుపాదం…ఆరు కోట్ల ఆస్తుల జప్తు!

Share It:

హైదరాబాద్: తెలంగాణ ఈగల్ ఫోర్స్, నిజామాబాద్ పోలీసులతో కలిసి నిర్వహించిన ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాకు చెందిన 6 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను జప్తు చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు 15 మంది నిందితులను అరెస్టు చేశారు.

నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ పోలీసులు, ఈగిల్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన విచారణలో గుర్తించిన ఈ ఆస్తులలో 9.06 ఎకరాల వ్యవసాయ భూమి, 1,370 చదరపు గజాల ఖాళీ స్థలాలు, ఒక రసాయన కర్మాగారం, నాలుగు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ప్రభుత్వ ధరల ప్రకారం వీటి విలువ రూ. 2.5 కోట్లుగా అంచనా వేయగా, ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ. 6 కోట్లుగా నిర్ధారించారు.

చెన్నై, ముంబైలోని సంబంధిత అధికారుల ధృవీకరణ అనంతరం, NDPS చట్టంలోని సెక్షన్ 68(F) కింద ఆగస్టు 17 – 19 తేదీలలో ఈ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.

అమర్ సింగ్ దేశ్‌ముఖ్, బాబూరావు బస్వరాజ్ కదేరే, మల్లెపుల లక్ష్మణ్ గౌడ్ సహా 15 మందిని అరెస్టు చేయడం, 32.5 కిలోల అల్ప్రజోలంను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యల తర్వాత ఈ ఆర్థిక విచారణ చేపట్టారు. పోలీసులు గతంలోనే NDPS చట్టంలోని సెక్షన్ 8(c)తో పాటు 22(c), సెక్షన్ 29 కింద బోధన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

అల్ప్రజోలం అక్రమ రవాణా ద్వారా వచ్చిన ఆదాయంతో నిందితులు, వారి అనుచరులు, బంధువులు చరాస్తులు, స్థిరాస్తులను సమకూర్చుకున్నారని విచారణలో తేలింది. ఈ విచారణలో భాగంగా రెవెన్యూ పాస్‌బుక్‌లు, అమ్మకపు పత్రాలు (sale deeds), ఆస్తి పన్ను రశీదులు, భవన నిర్మాణ అనుమతులు, రిజిస్ట్రేషన్ పత్రాలు, కొనుగోలు రశీదులను పరిశీలించారు.

మాదకద్రవ్యాల సరఫరాకు, కల్లు కల్తీకి మధ్య సంబంధం
అల్ప్రజోలం సరఫరా నెట్‌వర్క్‌కు, కల్లు కల్తీకి మధ్య ఉన్న సంబంధాలను కూడా ఈ విచారణ వెలికితీసింది. కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్, గాంధారి పోలీస్ స్టేషన్లలో నమోదైన వేర్వేరు కేసులలో, ఆల్ప్రజోలం (Alprazolam) కలిపిన కల్లును సేవించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాధితులను గుర్తించారు. వీరందరికీ వైద్య చికిత్స అందించారు.

సిద్దిపేటలోని ప్రభుత్వ డి అడిక్షన్‌ సెంటర్‌ నుండి కల్తీ కల్లు సేవించిన 100 మందికి పైగా వ్యక్తుల వివరాలను కూడా ‘ఈగిల్ ఫోర్స్’ (EAGLE Force) సేకరించింది. సిద్దిపేట పోలీసులతో సమన్వయం చేసుకుని, ఆ బృందాలు కల్లు దుకాణాలు, డిపోలపై దాడులు నిర్వహించాయి; అలాగే సిద్దిపేట I, II, III టౌన్ పోలీస్ స్టేషన్లలో మూడు కేసులను నమోదు చేశాయి. తెలంగాణ వ్యాప్తంగా 500కు పైగా గ్రామాల్లో కల్తీ కల్లు వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించినట్లు ఆ సంస్థ తెలిపింది.

ఆల్ప్రజోలం సేకరణ, తయారీ, రవాణా, పంపిణీలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణకు చెందిన వ్యక్తులు ప్రమేయం ఉన్నట్లు, ఒక అంతర్రాష్ట్ర సరఫరా నెట్‌వర్క్ పనిచేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.