Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఉమ్మడి పౌరస్మృతి అమలుపై ఎన్డీఏలో చీలిక… చర్చలకు జేడీ(యూ), ఎల్‌జేపీ డిమాండ్!

Share It:

న్యూఢిల్లీ: ఉమ్మడి పౌరస్మృతి (UCC) అమలుపై ఎన్డీయే (NDA) కూటమిలో బేధాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి ఎన్డీయే అధికారంలో ఉన్న 21 రాష్ట్రాల్లో యూసీసీని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో, బీహార్‌కు చెందిన కీలక మిత్రపక్షాలైన జేడీయూ (JD-U), ఎల్‌జేపీ (LJP-RV) పార్టీలు దీనిపై విస్తృత చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి.

జాతీయ స్థాయిలో యూసీసీకి మద్దతు ఇచ్చినప్పటికీ, బీహార్‌లో దీనిని అమలు చేయడానికి వీల్లేదని జేడీయూ స్పష్టం చేసింది. కేంద్రంలో ఎన్​డీఏకు మద్దతు ఇచ్చినంత మాత్రాన రాష్ట్రంలో యూసీసీని తాము అంగీకరించబోమని తెలిపారు. బిహార్‌లో బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, ఇది సంకీర్ణ ప్రభుత్వం అని- ఏకపక్ష నిర్ణయాలు చెల్లవని జేడీయూ హెచ్చరించింది.

యూసీసీ బిల్లు పార్లమెంటులో చర్చకు వచ్చిన సమయంలోనే నితీష్ కుమార్ తమ రాష్ట్రంలో అమలు చేయబోమని స్పష్టంగా చెప్పారని, నితీష్ కుమార్ పాత వైఖరికే తాము కట్టుబడి ఉన్నామని జేడీయూ నేత శ్యామ్ రజక్ పేర్కొన్నారు. కాగా, ఈ వివాదంపై చర్చించేందుకు జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా త్వరలో హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.

లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ సైతం దీనిపై ఆచితూచి స్పందించారు. యూసీసీ ముసాయిదా (Draft)ను బహిరంగపరచాలని, అన్ని భాగస్వామ్య పక్షాలతో విస్తృతమైన చర్చలు జరిపిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.

మరోవైపు, మిత్రపక్షాలు తమ వైఖరిని స్పష్టంగా చెప్పాలని బీహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ డిమాండ్ చేశారు. ఆర్జేడీ పార్టీ ప్రతినిధి అజాజ్ అహ్మద్ మాట్లాడుతూ- బీజేపీ తన రాజకీయ అజెండాను ముందుకు తీసుకెళ్లడానికే యూసీసీ అంశాన్ని ఉపయోగిస్తోందని ఆరోపించారు. దీనిపై బీజేపీ మిత్రపక్షాలు తమ వైఖరిని స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను హరించేలా బీజేపీ వ్యవహరిస్తోందని, యూసీసీపై జేడీయూ తన నిజరూపం ఏంటో ప్రజలకు స్పష్టం చేయాలని ఆర్జేడీ సవాల్ విసిరింది.

ప్రతిపాదిత యూసీసీ చట్రంలో బహుభార్యత్వంపై పూర్తి నిషేధం, ఏకరూప వివాహ వయస్సు, సహజీవనాల తప్పనిసరి రిజిస్ట్రేషన్, లింగ సమాన వారసత్వ హక్కులు, ఉమ్మడి వ్యక్తిగత చట్టాలు వంటి అంశాలు ఉన్నాయి. అయితే, షెడ్యూల్డ్ తెగలకు దీని పరిధి నుంచి మినహాయింపు ఉంది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.