న్యూఢిల్లీ: మణిపూర్‌లో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టం (AFSPA)ను మరో ఆరు నెలల పాటు కేంద్రం పొడిగించింది. ఈ పొడిగింపు అక్టోబర్ 1, నుంచి అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
కాగా, 2023 మే నెలలో రాష్ట్రంలోని కుకీ, మైతేయ్ వర్గాల మధ్య హింస చెలరేగినప్పటి నుంచి మణిపూర్ జాతి ఘర్షణల్లో చిక్కుకుంది. ఈ హింసలో నిరాశ్రయులైన సుమారు 43,000 మంది ప్రజలు ఇప్పటికీ సహాయక శిబిరాల్లో నివసిస్తున్నారు. గత మూడేళ్లుగా అనేక హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న 700 మందికి పైగా మరణించినట్లు కూడా నివేదికలు ఉన్నాయి.
మే 2023 నుండి ఆగస్టు 31, 2026 వరకు కొనసాగిన హింసాకాండలో 306 మంది మరణించారని, 49 మంది ఇప్పటికీ గల్లంతయ్యారని మణిపూర్ ప్రభుత్వం సెప్టెంబర్ 2026లో రాష్ట్ర అసెంబ్లీలో పేర్కొంది.
ఇటీవలి నెలల్లో, రాష్ట్రంలోని కొండ జిల్లాల్లో నాగా-కుకీ వర్గాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు చివరిలో జరిగిన ఘర్షణల్లో కనీసం ఏడుగురు మరణించారని, దీంతో ఫిబ్రవరి నుంచి ఇటువంటి ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 34కు చేరిందని హ్యూమన్ రైట్స్ వాచ్ తెలిపింది. 2026 వరకు మణిపూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాయుధ బృందాలు కాల్పులు, బందీలుగా పట్టుకోవడం, దహనకాండ, రహదారుల దిగ్బంధనాలకు పాల్పడినట్లు నివేదికలు వచ్చాయి.
సెప్టెంబర్ 24న, మయన్మార్ సరిహద్దు సమీపంలోని కామ్జోంగ్ జిల్లాలోని ఒక గ్రామంపై కుకీ నేషనల్ ఆర్మీ-బర్మా మిలిటెంట్లుగా అనుమానిస్తున్న వారు దాడి చేసి, నలుగురు టాంగ్ఖుల్ నాగా పౌరులను చంపినట్లు పోలీసు వర్గాలను ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది.
తాజా AFSPA పొడిగింపు ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, తౌబాల్, బిష్ణుపూర్, కాక్చింగ్ అనే ఐదు జిల్లాల్లోని 13 పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలు మినహా మణిపూర్‌కు వర్తిస్తుంది. కాగా, ఇంఫాల్, లాంఫెల్, సిటీ, సింగ్జామీ, పాత్సోయ్, వాంగోయ్, పోరోంపట్, హీంగాంగ్, ఇరిల్బుంగ్, థౌబల్, బిష్ణుపూర్, నాంబోల్, కాక్చింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ చట్టాన్ని మినహాయించారు.
AFSPA, 1958లోని సెక్షన్ 3 కింద కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 24న ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ ప్రకటన మార్చి 2027 వరకు అమలులో ఉంటుంది.
ఇదే సమయంలో, రాష్ట్రంలోని సాయుధ ఉద్యమాన్ని అణచివేసేందుకు భారత ప్రభుత్వం సైనిక చర్యలను చేపట్టిందని ఆరోపిస్తూ, నిషేధిత ‘రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్’ (RPF) స్వతంత్ర మణిపూర్ కోసం తన డిమాండ్‌ను పునరుద్ఘాటించిందని ‘ఇంఫాల్ టైమ్స్’ నివేదించింది.
మరోవైపు, ఓటర్ల జాబితాల ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) అంశంపై మణిపూర్‌లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది; చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞనేష్ కుమార్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.

