Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

విలక్షణ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

Share It:

న్యూఢిల్లీ: విలక్షణ నటుడు, నిర్మాత, సామాజికవేత్త నానా పటేకర్ గోవాలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 75 ఏళ్లు. సమాచారం ప్రకారం, తన మేనల్లుడు ప్రసాద్ పటేకర్‌తో కలిసి ఇంట్లో ఉన్న నానా పటేకర్, గత రాత్రి నుంచే తలనొప్పితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఆయన అపస్మారక స్థితిలో వెళ్లడంతో, వెంటనే ఆసుపత్రికి తరలించారు. మణిపాల్ ఆసుపత్రి వర్గాల సమాచారం మేరకు, ఆయనను ఆసుపత్రికి తీసుకువచ్చిన తర్వాత దాదాపు 45 నిమిషాల పాటు వైద్యులు ఆయనను బతికించడానికి ప్రయత్నించినప్పటికీ, ఎటువంటి ఫలితం కనిపించలేదు. ఉదయం 5:20 గంటలకు ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పటేకర్ కుమారుడు మల్హర్ పటేకర్ పూణేలో ఉండగా, ఆయన గోవాకు బయలుదేరారని సమాచారం.

1951 జనవరి 1న మహారాష్ట్రలో జన్మించిన నానా పటేకర్, తనదైన అభినయం, సంభాషణల ఉచ్చారణ, సంక్లిష్టమైన, విభిన్నమైన పాత్రలను పోషించి… నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నారు. మూడు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్న ఆయన, ‘నట్‌సామ్రాట్’, ‘వజూద్’, ‘పరిందా’, ‘అబ్ తక్ ఛప్పన్’, ‘యశ్వంత్’ వంటి చిత్రాలలో తన విలక్షణ నటనతో ప్రేక్షకుల అభిమానం పొందారు.

ఆయన 1978లో వచ్చిన ‘గమన్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. 2000ల ప్రారంభంలో, ‘శక్తి: ది పవర్’ (2002), ‘అబ్ తక్ ఛప్పన్’ (2004), ‘అపహరణ్’ (2005) మరియు ‘టాక్సీ నంబర్ 9211’ (2006) చిత్రాలలో తన నటనకు ప్రశంసలు అందుకున్నారు. అలాగే, ‘వెల్‌కమ్’ (2007), దాని సీక్వెల్ ‘వెల్‌కమ్ బ్యాక్’ (2015) అనే కామెడీ చిత్రాలలో గ్యాంగ్‌స్టర్ ‘ఉదయ్ శెట్టి’ పాత్రను పోషించి విస్తృత ప్రశంసలు పొందారు.

ఈ నటుడు ‘హౌస్‌ఫుల్ 5’ అనే కామెడీ థ్రిల్లర్ చిత్రంలో సహాయక పాత్రలో కూడా నటించారు. అతను ‘రాజ్‌నీతి’ (2010) అనే పొలిటికల్ థ్రిల్లర్ చిత్రంలో కూడా నటించాడు; ఈ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు ఐదవసారి నామినేషన్ పొందాడు.

2016లో, మరాఠీ చిత్రం ‘నట్‌సామ్రాట్’లో తన నటనకు గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు. సినీ,కళారంగాలకు అందించిన సేవలకు గాను 2013లో పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. అలాగే ‘యశ్వంత్’ (1997), ‘వజూద్’ (1998),’ఆంచ్’ (2003) వంటి చిత్రాలలో నేపథ్య గాయకుడిగా కూడా గుర్తింపు పొందాడు.

నానా పటేకర్ చివరిసారిగా నాలుగు రోజుల క్రితం గోవాలోని డోనా పౌలాలో కనిపించారు; అక్కడ ఆయన ‘సమ్రాట్ క్లబ్ ఇంటర్నేషనల్’ పదవీ స్వీకార కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు.

భారతీయ చలనచిత్ర రంగానికి అతీతంగా, సామాజిక సేవా కార్యక్రమాలతో – ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభం కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతులు, వారి కుటుంబాలకు అండగా నిలవడంలో ఆయన విశేష కృషి చేసారు.

2015లో మరాఠీ నటుడు మకరంద్ అనాస్పురేతో కలిసి నామ్ ఫౌండేషన్ (NAAM Foundation)ను ప్రారంభించారు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు, కరువు, నీటి కొరత వంటి సమస్యలపై ఈ సంస్థ పనిచేస్తోంది. రైతులకు కేవలం ఆర్థిక సహాయం అందించడం కాకుండా నీటి సంరక్షణ, గ్రామాల అభివృద్ధి, రైతులకు సామాజిక మద్దతు వంటి అంశాలపై కూడా దృష్టి పెడుతోంది. రైతులకు డబ్బు ఇవ్వడం మాత్రమే పరిష్కారం కాదని, వారికి ఆత్మవిశ్వాసం, మానసిక ధైర్యం, సామాజిక మద్దతు అవసరమని నానా పటేకర్ పలుమార్లు చెప్పారు.

కరువు, పంట నష్టం, అప్పుల కారణంగా ఆత్మహత్య అంచున ఉన్న మహారాష్ట్ర రైతులతో నానా పటేకర్ మాట్లాడుతూ…”మీ జీవితాన్ని ముగించుకోవాలనిపిస్తే నాకు ఫోన్ చేయండని” అన్నారు. రైతుల బాధలను ప్రత్యక్షంగా చూడటం వల్ల తన జీవితం మారిపోయిందని నానా పటేకర్ పలుమార్లు చెప్పారు. రైతులే దేశానికి జీవనాధారమని, వారు ఎదుర్కొంటున్న సంక్షోభం యావత్ దేశ సమస్య అని ఆయన అభిప్రాయపడ్డారు. రైతుల ఆత్మహత్యలపై ఓ టెలివిజన్ వార్తా కథనాన్ని చూసిన తర్వాత సామాజిక సేవపై మరింత దృష్టి పెట్టాలని నానా పటేకర్ నిర్ణయించుకున్నారు.

విదర్భలోని బీడ్ వంటి ప్రాంతాల్లో తాను చేసిన పర్యటనలు తనపై గొప్ప ప్రభావం చూపాయని ఆయన తెలిపారు. రైతుల మరణాలతో కుంగిపోయిన కుటుంబాలు, పిల్లలను చూడటం వల్ల తక్షణమే జోక్యం చేసుకోవాల్సిన అవసరం తనకు అర్థమైందని చెప్పారు.

నానా పటేకర్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం
నానా పటేకర్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు; ఆయన మరణం “తీరని లోటును మిగిల్చిందని” పేర్కొన్నారు.

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆ దిగ్గజ నటుడి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయనను కేవలం భారతీయ చలనచిత్ర రంగంలోని అత్యుత్తమ నటులలో ఒకరిగానే కాకుండా, ఒక ఆప్తమిత్రుడిగా మరియు గోవాతో బలమైన అనుబంధం కలిగిన అంకితభావం గల సామాజిక కార్యకర్తగా కూడా ఆయన గుర్తుచేసుకున్నారు.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా పటేకర్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, తమ మధ్య “చాలా సన్నిహితమైన, స్నేహపూర్వక సంబంధాలు” ఉండేవని తెలిపారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆయన అందించిన సహాయ హస్తం చాలా కుటుంబాలకు ఆసరాగా మారింది. నానా అద్భుతమైన కళాకారుడు-నటుడే కాదు, సమాజం పట్ల సున్నితత్వం కలిగిన వ్యక్తి అని ఆయన పేర్కొన్నారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.