న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యాపారులకు మరియు పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరటనిస్తూ…జీఎస్టీ అధికారులకు ఇప్పటివరకు ఉన్న నేరుగా అరెస్టు చేసే అధికారాన్ని కౌన్సిల్ రద్దు చేసింది. అలాగే, ప్రాసిక్యూషన్ ప్రారంభించడానికి గల పరిమితిని ఒక కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచింది.
కౌన్సిల్ నిర్ణయం ప్రకారం… కనీస శిక్షను తొలగించారు. జరిమానా, జైలు శిక్ష లేదా రెండూ విధించాలనే శిక్షను ప్రతి కేసులోనూ న్యాయవ్యవస్థ విచక్షణకే వదిలివేశారు. నిర్దిష్ట జరిమానా లేని చోట వర్తించే సాధారణ జరిమానాను రూ.25,000 నుంచి రూ.10,000కు తగ్గించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
పన్ను ఆలస్యంగా దాఖలు చేసినా, పొరపాటు చేసినా లేదా చెల్లింపును ఆలస్యం చేసినా, పన్ను చెల్లింపుదారుడు రికవరీ, వడ్డీ, దామాషా ప్రకారం జరిమానాను ఎదుర్కోవలసి ఉంటుంది, కానీ అంతకు మించి ఏమీ ఉండదు. కాగా, భారతదేశ వ్యాప్తంగా ఉన్న వ్యాపారస్తులు కఠినమైన పన్ను విధానాలపై ఫిర్యాదు చేశాయి. వ్యాపారం చేసే సౌలభ్యాన్ని మెరుగుపరచాలని కోరాయి.
కేంద్ర, రాష్ట్ర ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ మండలి ఆమోదించిన మార్పులు ఏప్రిల్ 1, 2027 నుంచి అమలులోకి వస్తాయి. సమావేశం అనంతరం విలేకరులతో కేంద్ర ఆర్థికమంత్రి సీతారామన్ మాట్లాడుతూ… జీఎస్టీ రేట్లలో మార్పులు చేయడం కంటే, వ్యాపారం చేసే సౌలభ్యాన్ని మెరుగుపరచడం, నిబంధనల పాటింపు భారాలను తగ్గించడం లక్ష్యంగా ప్రక్రియ సంబంధిత సంస్కరణలపై మండలి దృష్టి సారించిందని అన్నారు.
“అరెస్టు చేసే అధికారం తొలగించామని, అయితే, జీఎస్టీ చట్టం కింద క్రిమినల్ ప్రాసిక్యూషన్ కొనసాగుతుందని ఆమె నొక్కి చెప్పారు. “నేరపూరిత చర్య జరిగినట్లు తేలితే, ప్రజలపై ప్రాసిక్యూషన్ చేపట్టేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుందని మంత్రి సీతారామన్ అన్నారు.
పన్ను చెల్లింపుదారులకు రూ. 10,000 లోపు మొత్తాలకు సంబంధించిన నోటీసులు జారీ చేయకూడదని, అలాగే ఈ పరిమితి కంటే తక్కువ ఉన్న పెండింగ్ నోటీసులను కూడా ఉపసంహరించుకోవాలని మండలి సిఫార్సు చేసింది.
“అదేవిధంగా, మేము పేర్కొన్న పరిమితి కంటే తక్కువ ఉన్న పెండింగ్ నోటీసులను ఉపసంహరిస్తాము. ఒకవేళ అది జారీ చేసి ఉంటే, దానిని ఉపసంహరించుకుంటాము,” అని సీతారామన్ అన్నారు. విశ్వాసం అనే సూత్రం ఆధారంగానే జీఎస్టీ సంస్కరణల ప్రక్రియ సాగిందని మంత్రి అన్నారు.
“వ్యాపారాలను విశ్వసించాలి, అలాగే పన్ను చెల్లింపుదారులను కూడా విశ్వసించాలి. వ్యాపార సంస్థలు పరస్పర విశ్వాసంతో వ్యవహరిస్తున్నప్పుడు, మనం వాటి పనితీరులో మరీ ఎక్కువగా జోక్యం చేసుకోకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

