చండీగఢ్: ఉన్నతాధికారుల కుల వివక్షకు తాళలేక సీనియర్ ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం హర్యానాలోనే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయ తుఫానుకు దారితీశాయి. ఈ సంఘటన ప్రభావం వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న బీహార్‌కు చేరుకుంది.
ఒక సీనియర్ పోలీసు అధికారి మరణం వ్యవస్థను కుదిపేసింది. ఉన్నత స్థాయి అధికార వర్గాలలో కూడా కుల వివక్ష కొనసాగడంపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. కానీ మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హర్యానాలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వం సత్వర చర్య తీసుకోకపోవడం.
పార్టీ ఇప్పటివరకుజాగ్రత్తగా స్పందించడం వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది, ప్రతిపక్ష పార్టీలు ఈ విషయాన్ని గ్రహించి, హర్యానా ప్రభుత్వంపై నిరంతర దాడిని ప్రారంభించాయి.
మృతుడి కుటుంబం రెండు ప్రధాన డిమాండ్లను సమర్పించింది. మొదటిది, రాష్ట్ర డీజీపీ శత్రుజీత్ సింగ్ కపూర్, రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాలను వెంటనే సస్పెండ్ చేసి అరెస్టు చేయడం. ఈ అధికారుల కుట్ర వల్లే అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబం ఆరోపించింది. రెండవది, ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా ఉన్న ఇతరుల పేర్లలో స్పష్టత ఇవ్వాలని, ఎస్సీ/ఎస్టీ చట్టంలోని కఠినమైన సెక్షన్‌లను జోడించాలని కుటుంబం డిమాండ్ చేసింది.
ఈమేరకు మృతుడి బావమరిది, పంజాబ్ ఎమ్మెల్యే అమిత్ రట్టన్, “మాకు అన్యాయం జరుగుతోంది. ఒక ఏడీజీపీ స్థాయి అధికారి మరణించారు, ఇప్పటి ఆరు రోజులు అయ్యింది, అయినప్పటికీ మాకు న్యాయం జరగలేదు” అని మీడియాతో అన్నారు.
పరిస్థితి మరింత దిగజారింది
కుటుంబాన్ని శాంతింపజేయడానికి, హర్యానా ప్రభుత్వం అక్టోబర్ 11న మృతుడి మరణం తర్వాత రోహ్‌తక్ ఎస్పీని బదిలీ చేసింది. ఈ చర్యను సింబాలిక్‌గా అభివర్ణిస్తూ, అధికారి కుటుంబం దీనిని కేవలం కంటితుడుపు చర్యగా తోసిపుచ్చింది.
పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నప్పటికీ, రాష్ట్ర డీజీపీపై ఎటువంటి నిర్దిష్ట చర్య తీసుకోకపోవడంపై బీజేపీ ప్రభుత్వం మౌనం వహించడం వల్లే ఈ సమస్య తలెత్తింది. మృతుడి కుటుంబం ఇంకా పోస్ట్‌మార్టంకు అనుమతి ఇవ్వకపోవడంతో, వారి పెండింగ్ డిమాండ్లను ముందుగా నెరవేర్చాలని పట్టుబడుతున్నందున దహన సంస్కారాలను నిలిపివేశారు.
కేసును దర్యాప్తు చేస్తున్న చండీగఢ్ పోలీసులు, అధికారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు, కానీ కుటుంబం అనుమతి ఇవ్వలేదు, ఆ తర్వాత వైద్య ప్రక్రియను నిలిపివేశారు.
ట్రిబ్యూన్‌కు ఇచ్చిన ప్రకటనలో, మరణించిన అధికారి భార్య, ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ పి. కుమార్ పోస్ట్‌మార్టం నిర్వహించడంలో తొందరపడటాన్ని ప్రశ్నించారు.
ప్రతిపక్షాల దాడి పెరుగుతోంది
మరోవైపు, దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు – సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, మాయావతి, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, చంద్రశేఖర్ ఆజాద్, బిజెపి మిత్రుడు చిరాగ్ పాస్వాన్ – సంఘీభావం ఈ అంశాన్ని జాతీయ వేదికపైకి తీసుకెళ్లింది.
ఆదివారం చండీగఢ్‌లో సెక్టార్ 20లో పలు దళిత సంఘాలు పెద్ద మహాపంచాయతీని నిర్వహించాయి. ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని కాంగ్రెస్ బెదిరించింది.
కాంగ్రెస్ ఎంపీ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ఆదివారం హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ “దేశ చట్టాలను ఉల్లంఘించారని” ఆరోపించారు. “బిజెపి ప్రభుత్వం ఎడిజిపి స్థాయి అధికారి కుటుంబానికి న్యాయం జరగాలని హామీ ఇవ్వలేకపోతే, ఈ పాలనలో సామాన్యుడు ఎలా న్యాయం ఆశించగలడు?” అని సుర్జేవాలా అన్నారు.
పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ కూడా మరణించిన అధికారి కుటుంబాన్ని చండీగఢ్‌లోని వారి నివాసంలో కలుసుకుని న్యాయం కోసం వారి పోరాటంలో సంఘీభావం తెలిపారు.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చన్నీ, మరణించిన అధికారి కుటుంబాన్ని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, తాను ఆత్మహత్య చేసుకోలేదని, దళితులు,పేదల కోసం నిలబడినందుకు అమరవీరుడయ్యానని అన్నారు.
హర్యానాలో రైతుల నిరసన సందర్భంగా, కుమార్‌ను పర్యవేక్షకునిగా పంపినప్పుడు, కాల్పులు జరపాలని, ఆందోళన చేస్తున్న రైతులపై కఠిన చర్యలు తీసుకోవాలని తనకు సూచించారని చన్నీ అన్నారు. “అతను అలాంటి ఆదేశాలను పాటించడానికి నిరాకరించాడు. అదే అతని చిత్తశుద్ధి” అని చన్నీ అన్నారు.
హర్యానాలోని ఖాప్ పంచాయతీలు కూడా ఆ కుటుంబానికి మద్దతు ఇచ్చాయి. చర్ఖీ దాద్రికి చెందిన ఖాప్ అధ్యక్షుడు సురేష్ ఫోగట్ మీడియాతో మాట్లాడుతూ, జూనియర్ అధికారులను లక్ష్యంగా చేసుకునే బదులు, ఈ కేసులో ప్రమేయం ఉన్న సీనియర్, బాధ్యతాయుతమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
కాగా, మహా పంచాయతీ బిజెపి ప్రభుత్వానికి 48 గంటల అల్టిమేటం ఇచ్చింది. కుమార్ కుటుంబం సమక్షంలో ఈ విషయంపై వివరణాత్మక చర్చ తర్వాత మహాపంచాయతీ ఏకగ్రీవంగా అనేక ముఖ్యమైన తీర్మానాలను ఆమోదించింది.
-ఈ కేసులో ప్రమేయం ఉన్న నిందితులందరినీ వెంటనే అరెస్టు చేయాలన్నది ప్రాథమిక డిమాండ్.
-దోషులకు కఠినమైన శిక్ష విధించేలా స్వతంత్ర న్యాయ విచారణ చేపట్టాలని మరొక తీర్మానం.
-నిందితులను అరెస్టు చేసే వరకు పోస్ట్‌మార్టం, అంత్యక్రియలు నిర్వహించం అని డిమాండ్లు చేశారు.
ప్రభుత్వం నిర్ణీత సమయంలోపు సమర్థవంతమైన చర్య తీసుకోవడంలో విఫలమైతే, వీధుల్లోకి వచ్చి విస్తృత ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ప్రారంభిస్తుందని మహాపంచాయతీ నిర్వహించిన అమరవీరుడు వై.పూరన్ కుమార్ న్యాయ్ సంఘర్ష్ మోర్చా సభ్యులు అన్నారు.
ఈ పోరాటం కేవలం ఒక కుటుంబం కోసం కాదని, మొత్తం సమాజం కోసం గౌరవం, న్యాయం, సమానత్వం కోసం పోరాటానికి ప్రతీక అని కూడా సంఘం నొక్కి చెప్పింది.


