జెరుసలేం: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన మరుసటిరోజే ఇజ్రాయెల్ దళాలు ఐదుగురు పాలస్తీనియన్లను చంపినట్లు సమాచారం. హమాస్ కాల్పుల విరమణలో భాగంగా బందీలందరినీ విడుదల చేసిన ఒక రోజు తర్వాత ఈ హత్యలు జరిగాయి. కాగా, హత్యలను ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది. వారు తమ సైనికులను సమీపిస్తున్నారనే సాకు చూపి వారిని చంపేసినట్లు అల్ జజీరా నివేదించింది.
మరోవంక ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, 28 ఏళ్ల పాలస్తీనియన్ పౌరుడు జర్నలిస్ట్ సలేహ్ అల్జఫరావిని గాజా నగరంలో కాల్చి చంపారు. మునుపటి రోజు, హమాస్ నిర్బంధంలో రెండు సంవత్సరాలుగా ఉన్న ఏడుగురు ఇజ్రాయెల్ బందీలను ఇజ్రాయెల్ రక్షణ దళాలకు (IDF) అప్పగించారు.
ప్రతిగా, ఇజ్రాయెల్ 1,900 మందికి పైగా పాలస్తీనియన్ ఖైదీలను విడుదల చేసింది. కరువుతో బాధపడుతున్న గాజాలోకి ఆహారం, సహాయ సామాగ్రిని అనుమతించింది.
విడుదలైన పాలస్తీనియన్లు ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని రమల్లాకు చేరిన తర్వాత అపారమైన ఆనందోత్సాహాలతో బంధవులు వారికి స్వాగతం పలికారు. అయితే ఇంతకాలం బందీలుగా ఉన్న పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దళాలు తీవ్రమైన హింసకు పాల్పడ్డాయి.
“2023 అక్టోబర్ 7నుండి ఇజ్రాయెల్ జైళ్లలో హింసను క్రమపద్ధతిలో అమలు చేస్తున్నారు. ఈ ఖైదీలు క్రూరమైన హింసను భరించారు” అని ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని బిర్జీట్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అయిన ఫర్రాజ్ అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. “వారిని కొట్టడం, హింసించడం జరిగింది. లైంగిక హింసకు సంబంధించిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి” అని ఆయన జోడించారు.
అయితే, ఇజ్రాయెల్ మాత్రం… పాలస్తీనియన్ డాక్టర్లు హుస్సామ్ అబు సఫియా, డాక్టర్ మార్వాన్ అల్ హామ్స్‌లను విడుదల చేయడానికి నిరాకరించింది.
ఇజ్రాయెల్ సైనిక దళాలు ఇప్పటివరకు 67,000 మందికి పైగా పాలస్తీనియన్లను, ప్రధానంగా మహిళలు,పిల్లలను బలిగొంది. దాదాపు లక్షా 70వేల మంది గాయపడినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా డేటా తెలిపింది.


