ముంబయి: గురుకుల అధిపతి, మహారాష్ట్రలోని ఒక ఉపాధ్యాయుడు క్యాంపస్లో మైనర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. రత్నగిరి జిల్లాలోని వార్కారి గురుకుల్ అధిపతి భగవాన్ కోకరే మహారాజ్, ఉపాధ్యాయుడు ప్రీతేష్ ప్రభాకర్ కదమ్… ఒక విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశారు.
మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుండి బాల బాలికలు ఆధ్యాత్మిక విద్యను అభ్యసించడానికి గురుకులంలో చేరారు. బాధితురాలు కూడా జూన్ 12న ఆమెకు అడ్మిషన్ లభించింది. మొదటి ఎనిమిది రోజులు బాగానే గడిచాయి. ఆ తరువాత కోకరే ఆ అమ్మాయిపై దాడి మొదలెట్టాడు.
“నేను గదిలో ఒంటరిగా ఉన్నప్పుడల్లా, అతను లోపలికి వచ్చి, నన్ను కొట్టేవాడు. నా ఛాతీని తాకేవాడు” అని బాధితురాలు చెప్పింది. ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారని, ఆమె బయటకు చెప్పకుండా నిరోధించారని ఆరోపించారు.
“కోకరే పరిచయాలు, సంబంధాలను ఉపయోగించి నా తండ్రిని ఇరికించి, నన్ను,నా సోదరుడిని చంపే అవకాశం ఉందని బాధితురాలు పేర్కొంది. అంతేకాదు నేను నా చదువును కొనసాగించకుండా నిషేధిస్తానని ప్రతేష్ ప్రభాకర్ కదమ్ నన్ను హెచ్చరించాడని ఆ బాలిక వాపోయింది.
కానీ, ఆ అమ్మాయి తన తండ్రికి విషయం చెప్పి, జరిగిన దారుణాన్ని వివరించింది, దీని తర్వాత పోలీసు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి రెండు రోజుల పోలీసు కస్టడీలో ఉంచారు.
కాగా, శివసేన ఉద్ధవ్ థాకరే వర్గంతో అనుబంధంగా ఉన్న ఎమ్మెల్యే భాస్కర్ జాదవ్ మాట్లాడుతూ… ఈ దాడికి మరింత మంది బాలికలు బాధితులుగా ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కోకరేతో అనుబంధం ఉన్న రాజకీయ నాయకులను,అతన్ని సందర్శించిన వారిపేర్లను తాను బయటపెడతానని శివసేన నాయకుడు అన్నారు.


