న్యూఢిల్లీ: పంజాబ్‌లోని రోపర్ రేంజ్డిఐజి సీనియర్ ఐపీఎస్ అధికారిని సీబీఐ అరెస్టు చేసింది. ఓ స్క్రాప్ డీలర్‌ను బెదిరించి 8 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఈ ఐపీఎస్ ఇంటి నుండి రూ.5 కోట్ల నగదు, లగ్జరీ వాహనాలు, ఆభరణాలు,హై-ఎండ్ వాచీలు సహా భారీ సంపదను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది.
2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన డిఐజి హర్చరణ్ సింగ్ భుల్లార్, అతని మధ్యవర్తిగా వ్యవహరించిన కృష్ణ అనే ప్రైవేట్ వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. స్థానిక వ్యాపారవేత్తపై నమోదైన క్రిమినల్ కేసును మూసివేసేందుకు ఈ మధ్యవర్తి ద్వారా లంచాలు డిమాండ్ చేసి, తీసుకోవడమేకాదు, నెలవారీగా మామూళ్లు డిమాండ్ చేస్తున్నట్లు సీబీఐ ఆరోపించింది.
ఫిర్యాదు-ఆపరేషన్
పంజాబ్‌లోని ఫతేఘర్ సాహిబ్‌లో ఆకాష్ బట్టా అనే స్క్రాప్ డీలర్ ఐదు రోజుల క్రితం సమర్పించిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు సిబిఐ గురువారం ఈ కేసును నమోదు చేసింది. 8 లక్షలు లంచం చెల్లించకపోతే, తన వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన కల్పిత కేసులో తనను ఇరికిస్తామని డిఐజి భుల్లర్ బెదిరిస్తున్నాడని, ఆ తర్వాత నెలవారీ “సెటిల్మెంట్” చెల్లింపులు డిమాండ్ చేశారని ఫిర్యాదుదారుడు ఆరోపించాడు.
ఈమేరకు సీబీఐ ఎఫ్ఐఆర్ ప్రకారం…చెల్లింపులను తన సహచరుడు కృష్ణ ద్వారా చేయాలని భుల్లర్ డిమాండ్ చేశాడని బాధితుడు ఆరోపించారు. దీంతో మధ్యవర్తిగా వ్యవహరించిన కృష్ణ వ్యాపారిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ‘ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు మామూళ్లు ఇవ్వలేదు’ మధ్యవర్తి మాట్లాడిన ఆడియో క్లిప్ ఉందని సీబీఐ పేర్కొంది.
ఈ విషయమైమ ప్రాథమిక విచారణ తర్వాత, చండీగఢ్‌లోని సెక్టార్ 21లో సిబిఐ ఉచ్చు బిగించింది. ప్లాన్‌లో భాగంగా బాధితుడు మధ్యవర్తికి ఫోన్ చేసి రూ.8 లక్షలు ఇస్తానని సెక్టార్ 21కి రమ్మని చెప్పాడు. అక్కడకు చేరుకున్న కృష్ణ ఆ డబ్బులు తీసుకుంటుండగా సీబీఐ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వ్యాపారితో డీఐజీకి కాల్ చేయగా.. డబ్బు తీసుకుని తన ఆఫీస్‌కు రావాలని ఇద్దర్నీ అతడు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. దీంతో సీబీఐ బృందం మొహాలీలోని తన కార్యాలయంలో DIG భులార్, ఇద్దరు నిందితులను అధికారికంగా అరెస్ట్ చేసింది. ఇద్దరు నిందితులను నేడు కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు.


