చెన్నై: దక్షిణాదిపై దృష్టి పెట్టిన బీజేపీ.. వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడలతో ముందుకు సాగుతోంది. మరోవంక నటుడు విజయ్ కొత్త పార్టీ తమిళగ వెట్రీ కజగం (టీవీకే) కేంద్ర బిందువుగా రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఈమేరకు బీజేపీ, దాని మాజీ మిత్రపక్షం అన్నాడీఎంకే రెండూ కూటమిగా ఏర్పడేందుకు తమిళ సూపర్ స్టార్ విజయ్‌తో చర్చలు జరుపుతున్నాయి.
దీనికి సంబంధించి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, బీజేపీకి చెందిన వానతి శ్రీనివాసన్… పొత్తు గురించి సూచనలు చేస్తూ వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాసన్ ‘బలమైన వ్యక్తులు ఎన్డీఏలో చేరవచ్చు’ అని పేర్కొన్నారు. అదెవరనేది మీరు ఊహించుకోవచ్చు” అంటూనవ్వులు చిందించారామె. అన్నాడీఎంకే, బీజేపీ సెప్టెంబర్ 2023లో విడిపోయినప్పటికీ, 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమ అవకాశాలను బలోపేతం చేసుకోవడానికి రెండు పార్టీలు విజయ్ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు, విజయ్ ఈ పురోగతిపై అధికారికంగా స్పందించలేదు.
అయితే… కరూర్ ఘటన తర్వాత తనకు సంఘీభావం తెలిపిన రాహుల్ గాంధీకి, సదరు బీజేపీ అగ్రనేతకు విజయ్ ధన్యవాదాలు తెలిపారు. గతంలో తాను ఏ కూటమిలో ఉండబోనని, డీఎంకే తమ రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక విరోధి అని విజయ్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరే ఉంటుందని, కలిసొచ్చే పార్టీలను చేర్చుకుని ముందుకు వెళ్తామని స్పష్టత ఇచ్చారాయన.
తాజాగా కరూర్ ఘటనపై సుప్రీం కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. విచారణ పర్యవేక్షణకు రిటైర్డ్ జడ్డతో సిట్‌ను సైతం ఏర్పాటు చేసింది. తాము కోరుకున్నట్లే సీబీఐ దర్యాప్తు రావడంతో విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. సత్యం గెలుస్తుంది అంటూ ఓ పోస్ట్ కూడా చేశారు. అయితే పొత్తుపై ఉధృతంగా జరుగుతున్న ప్రచారాన్ని మాత్రం ఆపలేకపోయారు.


