ముజఫర్‌పూర్: రికార్డు స్థాయిలో వరుసగా ఐదవసారి సీఎం పదవిని ఆశిస్తున్న నితీష్‌కుమార్ ముజఫర్‌పూర్ జిల్లాలోని మినాపూర్ నియోజకవర్గంలో తన తొలి ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. లాలూ ప్రసాద్ అధికారంలో ఉన్నప్పుడు “మహిళల కోసం ఏమీ చేయలేదని”, దాణా కుంభకోణంలో ఛార్జ్ షీట్ తనను పదవి నుంచి దిగిపోయేలా చేసినప్పుడు భార్య రబ్రీ దేవిని ఆసరాగా చేసుకున్నారని నితీష్ ఆరోపించారు.
మహిళా సాధికారతలో తన ప్రభుత్వం ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ…ఇటీవల ప్రారంభించిన ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన పథకం కింద దాదాపు కోటి మంది మహిళాల ఖాతాల్లో ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున జమ చేసినట్లు పేర్కొన్నారు. కానీ, నాడు ఆర్జేడీ పాలనలో ఇందుకు విరుద్ధంగా మహిళలు వివక్షకు గురయ్యారని నితీశ్ ఆరోపించారు. ఒకప్పుడున్న పరిస్థితులు కారణంగానే ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్నానని, అది తప్పు అని తెలియడానికి తనకు ఎంతో సమయం పట్టలేదని నితీశ్ గుర్తుచేసుకున్నారు.
“అధికారంలో ఉన్నవారు మహిళల కోసం ఏదైనా చేశారా? ఏడేళ్లు పదవి అనుభవించాక, రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు…అప్పటి వరకు రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేని తన భార్యకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారని వ్యాఖ్యానించారు. అది అప్పట్లో పెద్ద వివాదానికి దారితీసిందని గుర్తు చేశారు. బిహార్‌లో తాను అధికారం చేపట్టే వరకు శాంతిభద్రతలు అదుపులో లేవని, కానీ ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారిపోయాయో అందరూ చూడాల్సి ఉందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ, ముస్లింల మధ్య వివాదాలు తగ్గాయని నితీశ్ అన్నారు.
2005లో బిజెపితో పొత్తు పెట్టుకుని ఆర్జేడీని ఓడించిన నితీష్‌కుమార్, తన ప్రత్యర్థి పార్టీతో పొత్తులను గుర్తుచేసుకున్నాడు, మొదట 2015లో,తరువాత 2022లో, ఈ రెండు సార్లు రెండేళ్ల కన్నా తక్కువ కాలం కొనసాగాయి. కాగా, ఈ రెండు సందర్భాలలో లాలూప్రసాద్ కుమారుడు, ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు అయిన తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా పనిచేశారు.


